మా మిత్రుడు ఆకెళ్ల రాఘవేంద్ర ద్వారా మొన్న తనికెళ్ళ భరణి గారిని కలిశాము. నేను, మరో అరుగురు మిత్రులు వెళ్లాము. ఆయన సింప్లిసిటీకి అందరం ఫ్లాట్ అయ్యాము. ఆయనలో కించిత్తు ఈగో కూడా కనబడలేదు. చాలా సరదాగా కలివిడిగా మాట్లాడారు. బయటకు వచ్చిన తర్వాత అందరూ మొదట అన్న మాట ఇదే. దాదాపు రెండున్నర గంటల సేపు ఆయనతో గడిపాము.
తన కవిత్వం చదివి వినిపించారు, అలాగే కొన్ని పాటలు పాడారు. ఆయనది మంచి గొంతు.
నేటి విద్యా వ్యవస్థను భరణి గారు తీవ్రంగా విమర్శించారు. కాసింత కవిత్వం, సంగీతం ఇతర కళలు లేకుండా ఈ చదువులు ఏమిటి? కళలు మనిషిలో సృజనాత్మకతను పెంచడమేకాకుండా మానవత్వాన్ని నింపుతాయి. చిన్న పిల్లల్ని చదువు పేరుతో హాస్టళ్ళలో వేసి తాము వారిని ఉద్ధరిస్తున్నామని అనుకుంటున్నారు పెద్దలు. ఈ పిల్లలు పెద్దయ్యాక తమను చూడకపోతే అది వారి తప్పు ఎంత మాత్రం కాదు. పిల్లల్ని యంత్రాల్లా మార్చి పెద్దలే తప్పు చేస్తున్నారని ఆయన అన్నారు.
అలాగే మార్కుల పోటీ ఎంత అసహ్యంగా ఉందో?? ఫస్టు రావడం అనేదానికి ఓ లిమిట్ లేకుండా పోయింది. 99% వచ్చినా ఇంకో శాతం ఏమైంది అంటారు. వ్యవస్థలో సమూలంగా మార్పులు రావాలని ఆయన అభిలషించారు.
విద్యార్థులు తీవ్ర ఒత్తిడిలో ఆత్మహత్యలకు పాల్పడటం విచారకరం అని తనికెళ్ళ భరణిగారు చెప్పారు. చదువే జీవితం కాదు, అది జీవిరంలో ఒక భాగం మాత్రమే అని అన్నారు.
మొత్తమ్మీద ఎన్నో విషయాల మీద మేము అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం ఇచ్చారు.
జీవని గురించి మేము వివరించాము. చాలా మంచి పని చేస్తున్నారు, కానీయండి. విజయం సాధిస్తారు అని అన్నారు.
Read More