మేనరికపు వివాహాలు ఇంకా చేసుకుంటున్నారా? ముందుకంటే ఇప్పుడు తగ్గాయి అనుకోవచ్చు. ఎక్కడైనా మేనరికపు వివాహం జరుగుతుంటే మీ వంతుగా వాటిని ఆపడానికి ప్రయత్నం చేయండి.
ఎందుకంటే...
నాకు దగ్గరి మిత్రుడు మేనరికపు వివాహం చేసుకున్నాడు. వారికి ఒక అబ్బాయి. చాలా ముచ్చటగా ఉంటాడు. 7 సంవత్సరాల వరకు ఎలాంటి సమస్యలు రాలేదు. ఆ తర్వాత కంటి చూపు క్షీణించడం మొదలైంది. మూడేళ్ల వ్యవధిలో పూర్తిగా మందగించింది. కేరళ వైద్యం వాడారు. కానీ ఫలితం లేదు. ఇప్పుడు తాజాగా స్పర్శ కోల్పోతున్నాడు. కేరళ వైద్యం వాడటం వల్ల వచ్చిన దుష్పరిణామాలు అని ఇక్కడి డాక్టర్లు చెబుతున్నారు. ఆ తల్లిదండ్రులు ఏడవని క్షణం లేదు.
ఇంతకంటే బాధాకరం ఆ అబ్బాయి పరిస్థితి.
అలాగే మానసిక వికలాంగులైన పిల్లలనూ చాలా మందిని చూస్తుంటాము. పెద్దలు చేసే తప్పునకు పిల్లలు బలి అవుతారు. మేనరికపు వివాహాల వల్ల అనువంశిక వ్యాధులకు అవకాశాలు ఎక్కువ అని తెలిసి కూడా చేసుకోవడం క్షమించరానిదే. ఒకవేళ పెళ్ళి తప్పనిసరి పరిస్థితే అయితే పిల్లలకు అవకాశం ఇవ్వకుండా దత్తత తీసుకోవాలి. తల్లిదండ్రులు లేని పిల్లలు ఎందరో ఉన్నారు. వారికి జీవితాన్ని ఇచ్చినట్లు అవుతుంది. పాప పుణ్యాల లెక్కన బేరిజు వేసుకున్నా ఈ చర్య ఒక మనిషి జీవితానికి సరిపడ పుణ్యం సంపాదినట్లే అవుతుంది.