దత్తతకు సంబంధించి మాకు తరచుగా కాల్స్ వస్తుంటాయి. కొద్దిరోజుల కిందట దినపత్రికలో వచ్చిన వార్త చూసి మరోసారి టపా పెడుతున్నాము.
దత్తత ఎందుకు?
1) పిల్లలు పుట్టే అవకాశం లేదు అని డాక్టర్లు నిర్ధారించాక వీలైనంత త్వరగా దత్తత ప్రక్రియ మొదలుపెట్టండి.
2) టెస్ట్ ట్యూబ్ బేబీస్ కోసం ఎక్కువసార్లు ప్రయత్నిచడం వల్ల మహిళల్లో హార్మోన్ల పరంగా సమస్యలు వస్తాయని డాక్టర్లు చెబుతారు
3) పిల్లలు లేరు అన్న భావన భార్యాభర్తలను కుంగదీస్తుంది
4) స్త్రీలు బంధువుల నుంచి, ఇంటాబయట రకరకాలుగా హింసను ఎదుర్కోవలసి వస్తుంది.
5) ఒక అనాధ బిడ్డను దత్తత చేసుకుంటే ఆ పాపకు / బాబుకు జీవితాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు
6) మీకు పాపపుణ్యాల పట్ల నమ్మకం ఉంటే ఏ మనిషీ జీవితంలో ఇంతకంటే పెద్ద పుణ్యం చేయలేరు. ఎంతమంది దేవుళ్ళను కొలిచినా అంత పుణ్యం వస్తుందని అనుకోలేము
7) మనం కొన్ని వేల సంవత్సరాలు బతకడం లేదు, ఏక్షణంలోనైనా ఈ ప్రపంచాన్ని వీడి పోవచ్చు. క్షణభంగురమైన జీవితానికి పిల్లలు లేరు అని ప్రతి క్షణం హింసపడే బదులు చక్కగా దత్తత తీసుకోవచ్చు. జీవితాన్ని సతృప్తికరంగా మలచుకోవచ్చు.
కొన్ని సలహాలు...
1) డాక్టర్లు నిర్ధారించాక మరికొన్ని సంవత్సరాలు గుళ్ళూగోపురాలు తిరిగాక తీరా చివరి అవకాశంగా దత్తతకు వెళ్తారు, అప్పటికి భార్యాభర్తలకు వయసు ఎక్కువ అయిపోయి ఉంటుంది. అలాగే మనం అప్లికేషన్ పెట్టిన వెంటనే దత్తత ఇవ్వరు. ఇందుకు కనీసం 1-2 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోండి. మీ పేరు సీనియారిటీ లిస్టులో ఉంటుంది. ఈలోపు పిల్లలు కలిగారనుకోండి శుభం, మీరు దత్తత ప్రక్రియ నుంచి తప్పుకోవచ్చు.
2) జీవని లాంటి ఆశ్రమాల్లో రాష్ట్రవ్యాప్తంగా వేల మంది పిల్లలు ఉంటారు. కానీ చాలామంది పిల్లలకు వారి అవ్వాతాతలు, పెదనాన్న చిన్నాన్న లాంటి వారు ఉంటారు. కాబట్టి ఆశ్రమాలు దత్తత ఇవ్వడం జరగదు. అలా ఇవ్వడం తీసుకోవడం చట్టవిరుద్ధం కూడా. డబ్బులు ఇచ్చి మోసపోవద్దు.
3) దత్తత ప్రక్రియ శిశుసంక్షేమ శాఖ, ఫ్యామిలీ కోర్టు ద్వారా అధికారులు, న్యాయమూర్తి సమక్షంలో జరుగుతుంది.
దత్తత తీసుకునే భార్యాభర్తలకు సహాయపడటానికి మేము ఎళ్ళవేళలా సిద్ధం. సమాచారం కావాలంటే jeevani.sv@gmail కి మెయిల్ చేయవచ్చు.
మిగతా వివరాలు కింద చూడండి
0 వ్యాఖ్యలు