1995 నుంచి ఇప్పటి దాకా కేవలం 15 కథలు మాత్రమే రాయగలిగాను. నేను చాలా నిదానం. కాకపోతే ఒకటి రెండు మినహాయించి అన్నీ సామాజిక స్పృహ కలిగినవే. ఓ మూడు కథలకు ఈనాడు, జ్యోతిలలో బహుమతులు వచ్చాయి. ఆరు కథలు సంకలనాల్లో వచ్చాయి. రచయితగా ఇది నా చరిత్ర.
కాలం గడిచేకొద్దీ నాలో అసంత్రుప్తి పెరగసాగింది. చదివేవాడు కరువైన ఈ కాలంలో ఎందుకు రాస్తున్నామో అనిపించింది. అదీకాక మనిషిగా నేను ఆచరించలేని చాలా విషయాలు ప్రవక్త లాగా కథల్లో పాఠకుల మీద రుద్దడం ఎంత వరకు న్యాయం? ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే! సాధారణంగా ఏ కళాకారుడిలోనైనా అరాచకం, విశౄంఖలం, విపరీతమైన మానసిక ధోరణులు ఎంతో కొంత శాతమైనా ఉంటాయి. నాలో కొంతే ఉందని అనుకున్నా, ఈ విషయం తెలుసుకునే కొద్దీ నేను సూక్తులు రాయడం మానివేసాను. కాలక్రమంలో నా అంతరంగ జ్వలన ఎక్కువ అవుతూ వచ్చింది. రాతల ద్వారా ప్రస్తుత పరిస్థితుల్లో సాధించేది ఏమీ లేదని అంపించింది. భౌతికంగా ఏదో చేయాలి. నేను చేస్తున్న పనికి భౌతికంగా ప్రయోజనాన్ని నేను చూడగలగాలి. ఆ త్రుప్తి కావాలి అనుకున్నాను. రచయితగా నా నెట్వర్క్ పెరిగిపోయింది.
ఒకసారి మదనపల్లిలో రచయితల ఇష్టాగోష్టి జరుగుతోంది. ఎందుకు కథలు రాస్తున్నారు అన్న అంశం మీద మాట్లాడుతున్నారు. నా వంతు వచ్చినపుడు " కథలు రాయడం నాలోని ఫ్రస్ట్రేషన్ కు అవుట్లెట్ గా భావిస్తాను. అంతకంటే ముఖ్యంగా ఒక అనాధాశ్రమం, ఒక వౄద్ధాశ్రమం ఏర్పాటు చేయడం నా జీవితాశయం. అందుకోసం పరిచయాలు పెంచుకుంటున్నాను అందుకు కథలు బాగా ఉపయోగపడుతున్నాయి" అన్నాను. ఖదీర్ బాబు గారు తలాడించి కథలను ఈ రకంగా కూడా ఉపయోగించుకుంటున్నావా కొత్తగా ఉంది అన్నారు. అలా నేను అనుకున్నది సాధిస్తూ వచ్చాను. మరోపక్క ఒకానొక ప్రజాస్వామిక ఎర్రపార్టీ దాని అనుబంధ సంస్థల్లో ఏమైనా సేవ చేయగలనా అంపించింది. చాలా కొద్ది రోజుల్లోనే అందులోని డొల్లతనం బయటపడింది. మార్క్స్ మహానుభావుడి ఇజం వీటిలో నా వరకు కనిపించలేదు. క్రమంగా నేను అన్నిటికి దూరం అయ్యాను.
నిజానికి నా అంచనా ప్రకారం నాకు 50 యేళ్ళు వచ్చేసరికి ఇప్పటి రూపాయి విలువ ప్రకారం 1 కోటి రూపాయలు సంపాదించాలి, 58 సంవత్సరాలకు ఈ పిల్లలకు, నీడలేని పెద్దలకు ఆశ్రమాలు స్థాపించాలి. ఇదీ నా ఆశయం. కానీ అనుకోకుండా ముందే కోయిల కూసింది. ఆశ్రమం తర్వాతి లక్ష్యంగా చేసుకున్నా. అంతవరకు ఏదోఒకటి చేయాలి అన్న తపనతో జీవని మొదలు పెట్టాం. నన్ను నమ్మిన ఎందరో మిత్రులు, నన్ను దగ్గరగా చూసిన ఆప్తులు నాకు అడగగానే చేయూతను అందించారు. నేను వాళ్ళ అంచనాను ఏ మాత్రం తప్పకుండా వీలైనంత పారదర్శకంగా, ఒక్క పైసా దుర్వినియోగం లేకుండా జీవని ద్వారా పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తాను. ఇది అందరి సంస్థ, ఇక్కడ నేను అన్న మాటకు అర్థం లేదు. అందుకే ఇకనుంచి నేను ను పరిహరిస్తాను. ఈ సంస్థ పూర్తి స్థాయిలో వికేంద్రీకరణ చేయబడింది. వివరాలు , సమాచారం తెల్పడం , మానవ వనరుల సమీకరణ మాత్రమే ఈ నేను అనేఅవాడిని చేసే పని. ప్రతిరోజూ జీవని కార్యక్రమంపై సమాచారం బ్లాగులో ఉంటుంది. అదేవిధంగా దాతలు ఇచ్చిన డబ్బు వివరాలు కూడా! 18.6.09వ తేదీన నలుగురు పిల్లలు జీవని ద్వారా ప్రైవేటు రెసిడెన్షియల్ పాఠశాలలో చేరుతున్నారు. ఆ వివరాలు తర్వాతి టపాలో...
అనుక్షణం ఆనందంగా జీవించండి వీలైనంత మేర సేవ చేయండి...
Join hands with...
JEEVANI
JEEVANI
......FOR UNCARED
0 వ్యాఖ్యలు