మిత్రులారా ఇది ప్రాథమిక అంచనా. ఈ సంఖ్య నిధుల లభ్యతని బట్టి ఉంటుంది. నిధులకు ఇబ్బంది అయితే మనకు తప్పనిసరిగా అవసరం అయ్యేవి మాత్రమే కట్టుకుంటాము.


తరగతి గదులు - 7
స్టాఫ్ రూములు - 2
ప్రధానోపాధ్యాయులు & కార్యాలయ సిబ్బంది - 1
జీవని కార్యాలయం - 1
గ్రంథాలయం - 1
ల్యాబ్ - 2 ( కంప్యూటర్, ఇతర సబ్జెక్టులు )
సెమినార్ హాలు - 1
హాస్టల్ గదులు పెద్దవి - 4
స్టోర్ రూము + వంటగది + భోజన శాల - 1
టీచర్లకు క్వార్టర్స్ - 3
నాన్ టీచింగ్ సిబ్బందికి - 3
టాయిలెట్లు - అవసరమైనన్ని


కంప్యూటర్లు ఓ 10 సమకూరితే అపుడు ల్యాబ్ కు బదులు క్లాస్ కు ఒకటి పెడితే ఎలా ఉంటుంది? బోధించేటపుడు ప్రతి వాక్యానికి ఉపాధ్యాయుడు దానికి సంబంధించిన దృశ్య రూపాన్ని పిల్లలకు చూపించాలి. ఉదా.. ఎడారి అన్నపుడు ఆ ఫోటోలు, చార్మినార్, గాంధీజీ ఇలా ఏదైనా కావచ్చు. కాబట్టి పిల్లలకు కంప్యూటర్ పరిఙ్ఞానం కల్పించటంతో పాటు ఈ రకంగా కూడా వాటిని ఉపయోగించవచ్చు. దృశ్యం, స్పర్శ ద్వారా ఏర్పర్చుకున్న ఙ్ఞానం మెదడులో నిల్చిపోతుందని నా అభిప్రాయం.

ఇక సెమినార్ హాలులో రెండో వైపు అన్ని మతాలకు సంబంధించిన దేవుళ్ళ ప్రతిమలు ఉంటాయి. అక్కడ అందరూ ప్రార్థనలు చేసుకోవచ్చు.

ఇందుకు మార్పులు చేర్పులు ఉంటే దయచేసి సూచించండి.


Join hands with...

JEEVANI

......FOR UNCARED

contact : jeevani.sv@gmail.com
9440547123

Read More




మిత్రులారా జీవని చరిత్రలో మరో మైలు రాయి. శ్రీ రంగారెడ్డి గారు,PRINCIPAL, SREENIVASA RAMANUJAN INSTITUTE OF TECHNOLOGY, ANANTAPUR జీవనికి 3 ఎకరాల స్థలాన్ని కేటాయించడమే కాకుండా 5 లక్షల విరాళాన్ని కూడా ప్రకటించారు. ఈ స్థలం అనంతపురానికి 19 కిలోమీటర్ల దూరంలో గార్లదిన్నె సమీపాన ఉంది. ఇది మంచి సారవంతమైన, నీటి వనరులున్న ప్రాంతం. బెంగుళూరు - హైదరాబాదు హైవే పక్కనే ఈ స్థలం ఉంది. ఈ స్థలం విలువే దాదాపు 25 లక్షలు ఉంటుంది. రంగారెడ్డి గారి వితరణకు జీవని హృదయ పూర్వకంగా కృతఙ్ఞతలు తెల్పుతోంది. శ్రీ. సాంబశివా రెడ్డిగారు SECRETARY & CORRESPONDENT, SREENIVASA RAMANUJAN INSTITUTE OF TECHNOLOGY, ANANTAPUR 5 లక్షలు విరాళం ఇస్తానన్న సంగతి మీ అందరికీ తెలిసిందే.


వీటిని బేరీజు వేసుకుని 13.06.2011న జీవని హాస్టల్ మరియు పాఠశాలను ప్రారంభించాలని టెంటేటివ్ గా నిర్ణయించాము. దీన్ని లక్ష్యంగా పెట్టుకుని ఇక పని చేస్తాము. 50 మంది జీవని పిల్లలతోను 160 మంది బయటి పిల్లలతోను స్కూల్ ప్రారంభం అవుతుంది. ( LKG - 5వ తరగతుల వరకు తరగతికి 30 మంది చొప్పున) బయటి పిల్లలతో కూడా వీలైనంత తక్కువ ఫీజులు వసూలు చేస్తాము. టీచర్ల జీతభత్యాలకు వీటిని వాడటం జరుగుతుంది. జీవని పిల్లల హాస్టల్ ఖర్చుకు ఇప్పటిలాగే విరాళాలు స్వీకరిస్తాము. భవిష్యత్తులో దాతలు పెరిగే కొద్దీ బయటి పిల్లలను తీసుకోవడం తగ్గిస్తాము. ఈ ప్లాన్ కేవలం సేఫ్ సైడ్ గా ఉండటం కోసమే. చివరకు దాతలు పూర్తి స్థాయిలో వచ్చినపుడు మన స్కూల్లో కేవలం జీవని పిల్లలు మాత్రమే ఉంటారు.


ఇద్దరు దాతల ఫోటోలతో ఈ టపాను తిరిగి అప్ డేట్ చేస్తాము.



అనుక్షణం ఆనందంగా జీవించండి వీలైనంత మేర సేవ చేయండి...


Join hands with...

JEEVANI

......FOR UNCARED

contact : jeevani.sv@gmail.com
9440547123

Read More



ఊరును ఎంపిక చేసుకోవడంలో ఎందుకు విఫలం అయ్యాం అన్న ప్రశ్నకు సమాధానం చెప్తాను. కోవెలకుంట్ల, నంద్యాల మీదుగా కుందూ నది వెళ్తుంది. అది కూడా తన వంతు బీభత్సాన్ని సృష్టించింది. అయితే ఆ పల్లెలు ఏవీ పూర్తిగ మునిగిపోలేదు. కానీ కుందూ పల్లెల్ని చుట్టివేసింది. దారుల్ని భయంకరంగా కోసివేసింది. చుట్టూ నీళ్ళు మధ్యలో ఊర్లు, దాదాపు లంకల్లాగా తయారైంది పరిస్థితి. పల్లెలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. హెలికాప్టర్ల ద్వారా ఆహారం పంపిణీ చేశారు. అందువల్ల అందరూ ఈ పల్లెలు బాగా దెబ్బ తిన్నాయని అపోహపడ్డారు. ఆ విధంగా... చెప్పినవారి తప్పు కూడా లేదు. ఇంకో విషయం ఏమంటే ఇంతలా కాదుగానీ ఇలా ముంచెత్తడం కుందూ నదికి ప్రతి సంవత్సరం అలవాటేనట. ప్రజలు కూడా దానికి తగ్గట్టే అప్రమత్తంగా ఉంటారట. అవసరమైన సామగ్రి మాత్రమే తమ దగ్గర పెట్టుకుని ఉంటారు.


మేము నలుగురు వ్యక్తులు ఊరును డిసైడ్ చెయ్యడానికి మా శాయశక్తులా ప్రయత్నించాము. మా మిత్రుల సమాచారాన్ని బట్టి మాత్రమే మేము వెళ్ళాము. ఇలా వెళ్తున్నవారికి ప్రభుత్వం నుంచి కించిత్తు గైడెన్స్ కూడా లేకపోయింది. @ కొత్త పాళీ గారు: మరి ఏరకంగా మేము అనంతపురం నుంచి ఆ గ్రామాలను సెలెక్ట్ చేసుకుని ఉండవచ్చు చెప్పండి. సరే చీకటి పడిపోయింది. వెనక్కి వచ్చే క్రమంలో ఉప్పులూరు అనే గ్రామం, కేవలం 50 ఇళ్ళు ఉంటాయి.వరద కాదుగానీ మామూలుగానే వారి పరిస్థితి ఘోరంగా ఉంది. వారికి కిట్స్ అందజేశాం. ఆ తర్వాత అందరం సమావేశం అయ్యి పొద్దుటే మళ్ళీ సుంకేశుల వైపు వెల్డామని నిర్ణయించాము. రాత్రికి మిత్రుడు నరేష్ వాళ్ళ ఊరు జూలెపల్లెలో విశ్రమించాము. ఆఫీసుల తొందర ఉన్న వారు అనంతపురం వెళ్ళి పోయారు.


మరుసటి రోజు మధ్యాహ్నానికి ముడుమాల చేరుకున్నాము. మా వాహనాన్ని చూడగానే జనం ఎగబడ్డారు. దాదాపు ఐదారు వందల మంది వాహనం వెంట పరుగులు తీస్తూ వచ్చారు. నిజంగా ఆకలి గొన్న వాడి పరిస్థితి అప్పుడు అర్థం అయింది. మా వాహనం ఒక చోట స్లో చేశారు. మేమంతా ముందు వైపు ఉన్నాం. ఒక వ్యక్తి వెనక వాహనం ఎక్కి ఒక మూట తీసుకుని పారిపోయాడు. మన వాలంటీర్లు కవర్ చేసి జాగ్రత్తపడ్డారు. అదీ అక్కడి పరిస్థితి. మేము ఒకచోట సెటిల్ అయ్యేలోపు విచక్షణ లేకుండా తోపులాడుకుంటున్నారు.

మేము బాలిరెడ్డి అనే ఆయన సహాయం తీసుకున్నాము. ఆ ఊరి మొత్తానికి పూర్తిగా మునిగిన ఇళ్ళు ఆయనదే. కాకపోతే పెద్ద రైతు. ఇంకా ఆరోజే ఆయన ఇళ్ళు క్లీన్ చేయించాడు. ప్రజలందర్నీ కాంపౌండులో కూచోబెట్టి వీధుల వారిగా టోకెన్లు ఇచ్చి పంపిణీ చేశాము. తర్వాత గందరగోళం ఎక్కువకావడంతో మా ప్లాన్ మార్చాము. వెహికిల్ ను ఇళ్ళ వద్దకు తీసుకువెళ్ళి కిట్స్ పంపిణీ చేశాము.
తర్వాత సింగవరం వెళ్ళాము అక్కడినుంచి సుంకేశుల కూతవేటు దూరంలో వుంది. అక్కడ మిత్రుడి ఇంట్లో భోజనం చేసుకున్నాము. బట్టలను పంపిణీ చేశాము. తిరిగి అనంతపురం బయలుదేరాము.

Read More

ఈ మాటలు అన్నది గ్రామస్థులు. వివరాల కోసం మిమ్మల్ని మాతో పాటు నంద్యాల తీసుకువెళ్తున్నాను. మొదటిసారి వరద సాయాన్ని సుంకేశుల వైపు పంపిణీ చేశాము కాబట్టి ఈ సారి వ్యతిరేక దిశలో నంద్యాల వైపు వెళ్దాం అని అనుకున్నాము. మా వాహనానికి డి.ఆర్.డి.ఎ. ప్రాజెక్ట్ డైరెక్టర్ టి. రంగయ్య గారు జెండా ఊపాలి. ఆయనతో నాకు పూర్వ పరిచయం ఉంది. పై స్థాయి అధికారుల్లో నిడారంబరంగా, నిష్కల్మషంగా, అహంభావం లేని వారు అరుదుగా కనబడతారు. వీరిలో ఈయన ప్రథములు. ఆయన బంగ్లా వద్ద కార్యక్రమం. నేను, సతీష్ బయట వాహనానికి బ్యానర్లు కట్టించడం లాంటి పనులు చేస్తున్నాము. ఆలస్యం అవుతుండటంతో సాంబ, శ్రీను, నాగేశ్వర రెడ్డి ఆయనతో మాట్లాడుతున్నారు. మేము బయట రెడీ చేసేలోపు మన వాళ్ళు ఆయనకు మనం చేసిన కార్యక్రమం మొత్తం వివరించారు. వాహనాన్ని రెడీ చేశాక ఆయన జెండా ఊపారు. వాహనాలు కదులుతున్నాయి. రంగయ్యగారు " మీ కార్యక్రమం చూస్తుంటే నేనూ మీతో పాటు రావాలి అనిపిస్తోంది. మీరు వెళ్తున్న గ్రామాలకు కూతవేటు దూరంలో మా ఊరు గోస్పాడు ఉంది. ఈ రోజు ఎలాగూ ఆదివారం. అలాగే డి.ఆర్.డి.ఎ. తరఫున 500 జతల బట్టలు ఇవ్వాలని అనుకున్నాము. నేను వస్తే మీకు ఏమైనా అభ్యంతరమా " అని అడిగారు. మేము అందరం సంతోషంతో ఆయన్ను ఆహ్వానించాము.





మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో గోస్పాడు చేరుకున్నాము. రంగయ్య గారి అన్న వాళ్ళ ఇంట్లో భోజనం చేసి పంపిణీకి బయలుదేరాము. రాయపాడు అనే ఊరికి వెళ్ళాలని అనుకుంటున్నాము. బయట మా మాటలు వింటున్న ఒక పెద్దాయన మా దగ్గరకొచ్చి " మాది రాయపాడే, మాకు అవసరం లేదులే సార్! పెద్దగా ఏమీ నష్టపోలేదు. పూర్తిగా నష్టపోయిన వాళ్లకు ఇవ్వండి. మా దగ్గరలోని వూరివాళ్ళు కూడా వరద సాయం చెయ్యడానికి గుండ్రేవుల వెళ్ళి వచ్చారు ( మనం మొదటిసారి వెళ్ళింది, ఇక్కడికి 100 కి.మీ. పైన ఉంది) ఇక్కడ నిజంగా సమస్య ఉంటే వీళ్ళంతా అంత దూరం ఎందుకు వెళ్తారు? మీరు ఎంతో కష్టపడి వచ్చారు " అని అన్నాడు. మేము గందరగోళంలో పడ్డాము. సరే ముందు మనం వెళ్ళి పరిశీలించి వద్దాం అని క్రూయిజర్ లో అందరం వెళ్ళాము. అక్కడ పరిస్తితి సాదాసీదాగా ఉంది. ఊరు మొత్తానికి నీళ్ళు మూకాలి లోపే వచ్చాయట. పెద్దగా వరద ప్రభావం లేదు. దగ్గరలోని కూలూరు, తేళ్ళపురిలో కూడా ఇదే పరిస్థితి అన్నారు. దాంతో మేము వెనుదిరిగాము.



మా విచారణలో లింగాల అనే ఊరు తేలింది. సరే అని మొత్తం పటాలం అంతా అక్కడికి బయలుదేరింది. తీరా వెళ్ళాక అక్కడ జాతర జరుగుతోంది. ఒక స్వచ్చంద సంస్థ ఏవో కిట్స్ ఇస్తోంది. మరో సంస్థ ఊరిలో టోకెన్లు పంచుతోందట. మేము దిగి పరిస్థితిని చూస్తున్నాము. పంచుతున్న సంస్థకు సంబంధించిన వ్యక్తి మాదగ్గరకొచ్చి కొందరిని చాటుగా తీసుకు వెళ్ళాడు. ఆయనతో పాటు నలుగురం గుడిలోకి వెళ్ళాము. " దయచేసి మీరు వెళ్ళిపోండి సార్ ! ఇక్కడ వీళ్ళకు సహాయం అందించడం దండగ. మనమేమీ డబ్బులు ఎక్కడా కొట్టుకు రాలేదు, ఎంతో కష్టపడి సమీకరించుకుని ( అడుక్కుతిని అని ఆయన అక్కసుగా అన్నాడు) వీటిని మోసుకుని దూరం నుంచి వచ్చాము. మేము మోసపోయాము. అందరూ తీసుకుంటున్నవాళ్ళే తీసుకుంటున్నారు " అని చెప్పాడు. అక్కడివాళ్ళను అడిగాము వాస్తవ పరిస్థితి గురించి. వరద ప్రభావం పెద్దగా లేదు అని చెప్పారు. మేము జుట్టు పీక్కున్నాము. మరోవైపు చీకటి పడుతోంది. ఈలోపు పంపిణి చేసి వెనక్కి బయలుదేరాలన్నది మా ప్లాను. అదే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోను పూర్తిగా నష్టపోయిన వారికే మన సాయం అందాలి. రాజీ మాత్రం వద్దు అని అందరూ ముక్తకఠంతో చెప్పారు. సరే ముందు ఇక్కడి నుంచి బయటపడాలని అనుకుని ఊరు వదిలాము.

Read More

మిత్రులారా ఇంతవరకు వరద బాధితులకు మనం చేసింది తొలిదశ సహాయం. ఇంకా ఎవరైనా సహాయం చేయాలని ఉంటే వారికి అవకాశం... ఆత్మకూరు మండలం కొత్తపల్లి గ్రామంలో ప్రజలు అందరూ జాలర్లు. వారి అందరి వృత్తి చేపలు పట్టడం. వలలు కొట్టుకుపోయి వీరంతా నిరాశ్రయులు అయ్యారు. ప్రభుత్వం గుర్తింపు ఇచ్చిన జాలర్లకు వలలు పంపిణీ చేస్తుంది. కొందరు గుర్తింపు లేనివారు ఉన్నారు. వీరికి వలలు కొనివ్వడానికి కర్నూలులో రచయిత మిత్రుడు ఎం.హరికిషన్ ప్రయత్నిస్తున్నారు. ఒక్కొక్క వల 3000/- అవుతుంది. సైజు పెరిగేకొద్దీ వీటి ధర కూడా భారీగా వుంది. ఒక కుటుంబం నిలబడటానికి ఇది సరిపోతుంది. ఇంకా ఎవరైనా సహాయ కార్యక్రమాలు చేస్తుంటే దయచేసి బియ్యం వంటివి ఇక అక్కర్లేదు. ఇలా స్వల్పకాలికంగా కుటుంబాలను పోషించే కార్యక్రమాలను చేపట్టాలని ఆయన చెప్పారు. సంస్థలు స్వంతంగా పంపిణీ చేయాలి అనుకుంటే పూర్తి వివరాలు ఇవ్వగలం మీరే వారికి ప్రత్యక్షంగా ఇవ్వవచ్చు.ఇంకా ఎవరైనా స్పాన్సర్ చేయదల్చుకుంటే దయచేసి సంప్రదించగలరు.


jeevani.sv@gmail.com
9441032212 hari kishan
9948271023 jeevani

Read More

మిత్రులారా నిన్న సాయంత్రం అనంతపురంలోని SREENIVASA RAMANUJAN INSTITUTE OF TECHNOLOGY లో ఫ్రెషర్స్ డే వేడుక జరిగింది. ఈ కాలేజి కరస్పాండెంట్ సాంబశివా రెడ్డి మన జీవని సలహా సంఘం సభ్యులు కూడా. ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ ఎం.కె.సింగ్ వచ్చారు. స్టేజి మీద ఆయన కాక మరో ఐదుగురు ఉన్నారు. ఈయనది చివరి ప్రసంగం. మొదట ఐదుగురు ఇంగ్లీషులోనే మాట్లాడారు. కింద ప్రేక్షకులేమో ఇంగ్లీషు మీడియం చదువులు చదువుకుని వచ్చిన విద్యార్థులు. దాదాపు 600 మంది ఉన్నారు. ఎస్పీ గారు తన ప్రసంగాన్ని తెలుగులో మొదలు పెట్టగానే చెవులు చిల్లులుపడెలా కేకలు పెట్టారు పిల్లలు. ఆ తర్వాత నా వంతు వచ్చింది. మనమెట్లాగూ ఇంగ్లీషులో వీకు. ఎక్కడైనా, ఎప్పుడైనా మాట్లాడేదే తెలుగు, మన భాష రాకపోవడం ఎదుటివాడి ఖర్మ. సరే నేను కూడా " వేదికను అలంకరించిన... " అని మొదలు పెట్టగానే పిల్లలు హోరుమని కేకలు వేశారు.


ఇది నాకు ఒక భిన్నమైన అనుభవం. ఇన్నాళ్ళూ ఈ పిల్లలమీద ఉన్న ఆంగ్ల ముద్రను నేను సవరించుకున్నాను. అలాగే డ్యాన్సుల కోసం, పాడటం కోసం పిల్లలు ఇళయరాజా కాలం నాటి మెలోడీ పాటల్ను ఎంపిక చేసుకోవడం కూడా విశేషం.

ఈ కార్యక్రమంలోనే జీవని వలంటీర్లకు ఎస్పీ ఙ్ఞాపికలు, సర్టిఫికేట్లు ప్రదానం చేశారు.

మిత్రులారా వరద సిరీస్ ను మరి రెండు టపాలతో ముగిస్తున్నాము. ఇక్కడ మేమంతా తిరిగి యధావిధిగా జీవని పనుల్లో ఈ రోజు నుంచి నిమగ్నం అవుతున్నాము.

Read More





మొత్తం మూడు వాహనాల్లో మేము బయలుదేరాము. ఒక క్యారేజి వాహనం, క్రూయిజర్, కారు. దాదాపు 20మంది. కోడుమూరు నియోజకవర్గంలోని గూడూరు మండలంలో గుండ్రేవుల వుంది. కర్నూల్ దగ్గర ప్లానింగ్ కోసమని నేను సాంబశివారెడ్డి కారులోకి ఎక్కాను. ఆ తర్వాత మిగతా రెండు వాహనాలు, మేము వేర్వేరు దారుల్లో గుండ్రేవుల వైపు వెళ్ళాము. మా ప్రయాణం దాదాపు తుంగభద్ర నదికి సమాంతరంగా సాగింది.





బహుశా గుండ్రేవుల గ్రామం నదికి ఒక కిలోమీటరు దూరంలో ఉందేమో. తుంగభద్ర ఒక చిన్న పాయలాగా మాకు కనిపించింది.



మేము ఊరిలోకి ఒకవైపునుంచి అడుగుపెట్టాము. అక్కడి పరిస్తితుల గురించి మాట్లాడుకుంటూ ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటున్నాము. సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస రెడ్డి ఫోటోలు చక చకా తీసేస్తున్నాడు.



కరెంటు స్థంభం పైభాగాన్ని గమనించండి అంతవరకు నీళ్ళు వచ్చాయట.





ఆ ఊహే మమ్మల్ని వణికించింది. ఇంతలో అటువైపునుంచి వచ్చిన మన వాళ్ళ నుంచి ఫోను. అన్నా క్యారేజి వెహికిల్ రోడ్డు చివరకు వచ్చి ఒక పక్కకు పూర్తిగా ఒరిగిపోయింది. అర్జెంటుగా ఏదైనా ట్రాక్టరు తీసుకునిరండి లేదంటే బోల్తా పడుతుంది అని. అప్పుడు మాలో టెన్షన్ మొదలైంది. గ్రామస్థుల ట్రాక్టర్ తీసుకుని బయలుదేరాము. అక్కడి నుంచి మళ్ళీ ఫోను. అన్నా జనాలు మన వాహనం దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఏమి చేయాలి అని ఆందోళనగా అడిగారు. దూరం నుంచి మొదట ఓ పదిమంది కనబడ్డారట ఆ తర్వాత మరో 5 నిముషాలకు వందలాది మంది పరిగెత్తుకుంటూ వస్తున్నారట. వాళ్ళ నుంచి ఫోన్ల మీద ఫోన్లు త్వరగా రమ్మని. అందరిని పొలంలో లైన్లో కూచోబెట్టమని చెప్పాము.

వెళ్ళేసరికి దాదాపు ఏడెనిమిది వందల మంది ఉన్నారు. మన దగ్గర 400 ప్యాకెట్లు మాత్రమే ఉన్నాయి. అందరికీ నచ్చజెప్పి కూచోబెట్టడానికి మా తల ప్రాణం తోకకు వచ్చింది. మా కష్టాన్ని వారికి వివరించాము. ఎంతగా శ్రమ పడి సహాయం చేస్తున్నామో నిదానంగా 20 నిమిషాల పాటు బ్రెయిన్ వాష్ చేశాము. ఒకే కుటుంబంలోని వారు ఇద్దరు కూచోవద్దని వారిని కోరాము. కొద్దిసేపటికి పరిస్థితి పూర్తిగా మా అదుపులోకి వచ్చింది. ఇద్దరు తలార్లు, సర్పంచ్, స్టోర్ డీలర్, కానిస్టేబుల్ మాకు పంపిణీలో సహాయపడ్డారు.


@ మౌళి " ఈ ప్రొబ్లెం ఊహించినదే....కాని మీరు 400 కుటుంబాలకు పంపిణీ అని తెలుసు కాబట్టి ...వీలయితే ముందు ఆ ఫ్యామిలీస్ లిస్ట్ తీసుకొని... అక్కడికి వెళ్ళాక లిస్ట్ చదివి ఇవ్వవచ్చు కదా? " మౌళి గారు జీవని బ్లాగులో పెట్టిన కామెంటు ఇది. అక్కడి ప్రభుత్వ యంత్రాంగం ఎంత అసమర్థంగా పనిచేసిందో చెబితే మీరు జీర్ణించుకోలేరు. ఆ మాత్రం లిస్ట్, బాధిత గ్రామాల వివరాలు, అధికారులు, పోలీసుల సహాయం అందించి వుంటే చాలా పద్ధతిగా బాధితులకు ఎంతగానో లబ్ది చేకూరేది. అసలు ప్రభుత్వేతర సంస్థలు, వ్యక్తులు గుడ్డిగా గ్రామాల్లో దూరిపోయి పని చేయడం వల్ల పెద్ద ముప్పు తప్పింది. లేకపోతే మనం ఆకలి చావులు చూడాల్సి వచ్చేది. ఈ వైఫల్యాలను ఎలా సవరించివుండవచ్చో మరో టపాలో మాట్లాడుకుందాము.

గ్రామస్థులందర్నీ వరుసలో కూచోబెట్టాము కదా... మా బ్రెయిన్ వాష్ వాళ్ళ మీద బాగా పనిచేసింది.



కుటుంబానికి ఒకరు మాత్రమే కూచున్నారు. అప్పటికి పూర్తిగా చీకటి పడిపోయింది. కారు ఆన్ చేసి లైట్ల వెలుగులో
పంపిణీ మొదలుపెట్టాము.




పంపిణీలో ముందుగా ఓ నలుగురికి ప్రాధాన్యం ఇచ్చాము. ఆ నలుగురు... వారికి ఒక తెప్ప ఉండేదట. నీటి మట్టం పెరిగిపోయి ఇళ్ళమీద చెట్ల మీద ఉన్నవారిని దాదాపు 400 మందిని ఆ నలుగురే రక్షించారట.




వారిని మేము మనస్ఫూర్తిగా అభినందించాము. ఆ తర్వాత ఇద్దరు వికలాంగులకు ఇచ్చాము.


అప్పుదు పంపిణీ మొదలుపెట్టాము. ఆ ఊరి తలార్లు, సర్పంచ్, కానిస్టేబుల్ నియంత్రణతో పంపిణీ సజావుగా సాగింది. చివర్లో అక్కడ మాకు సహాయపడిన ప్రజలు ఓ 20 మంది ఉంటారు వారికి మిగతా అన్ని సరుకులు అందజేశాము. సరైన గ్రామానికి సరైన సమయంలో సహాయం చేశాం అన్న తృప్తి మాకు లభించింది. కానీ జీవని యూత్ బ్రిగేడ్ పడిన కష్టానికి సంస్థ మొత్తం వారికి రుణపడి ఉంటుంది. వారి సహాయమే లేకపోతే ఈ కార్యక్రమం మొత్తం నిస్సందేహంగా అట్టర్ ఫ్లాప్ అయ్యేది. వాళ్ళ కమిట్ మెంట్ కు నిజంగా మేమంతా ముగ్ధులం అయ్యాం. వాళ్ళు తప్ప శారీరకంగా కష్టపడే సామర్థ్యం మా బ్యాచ్ లో ఎవరికీ లేదు. అప్పుడు మా వాహనాన్ని గ్రామస్థులు, ట్రాక్టర్ సహాయంతో బయటకు లాగాము. అందరం ఇంటి దారి పట్టాము. మరచిపోయాను, కర్నూల్ నుంచి ఇద్దరు టీచర్లు, ఆకాశవాణిలో పనిచేసే సుధాకర్ గార్లు కూడా మాతో పాటే వచ్చి సహాయం చేశారు.


చివరగా ఒక్క మాట. ఆ చేతులు నాకు తరచుగా గుర్తుకొస్తుంటాయి.



సాయం కోసం చాచే చేతులవి. వ్యాన్ లో నుంచి ఏమి ఇస్తారో అన్న ఆశ! ఇంకా వీరి దగ్గర ఏమేమి ఉన్నాయో అవన్నీ మనకు దక్కితే బాగుండు అన్న ఆశ. ఆతృత, ఆందోళన, దొరకని వారిలో నిరాశా నిస్పృహలు. ఆఖర్లో మా వ్యాన్ ను చుట్టుముట్టిన ఆ ఇరవైమంది చేతులు చాచిన దృశ్యం నా కళ్ళ ముందే ఉంది. అది గుండెను పిండుతుంది. అంతటి దుర్భర పరిస్థితులు మనకే వస్తే... తల్చుకుంటేనే భయం అనిపిస్తుంది.

వరద వారి జీవితాల్లో కల్లోలం రేపింది....


పేదా ధనిక తేడా లేదు. రెండు రోజుల కిందట ఆ ఊర్లోనూ షావుకార్లు ఉన్నారు, పేదలు ఉన్నారు. రెడ్డి ఉన్నాడు, మాలా మాదిగ ఉన్నారు. మేము పోయిన రోజు అందరూ దీనులే. ఎవరి దగ్గరా తిండి గింజలు లేవు. ప్రకృతి - విధ్వంసంతో సమసమాజాన్ని సృష్టించింది. కానీ మనిషి అంత త్వరగా మార్పు చెంది మానవత్వాన్ని నింపుకుంటాడా? మరణం అంచు వరకూ వెళ్ళి వచ్చిన ఆ ఊరి ప్రజల్లో మరో వారానికి మళ్ళీ రకరకాల వైషమ్యాలు తారతమ్యాలు మొదలవుతాయి. ఆ ఊరి వాళ్ళే కాదు మనిషి అన్న వాడి గురించి నేను చెబుతున్నాను.




Read More


మొదటి రోజు 2000 మందికి పులిహోర సిద్ధం చేయించాము.

ఒక పక్క భరద్వాజ గారి విరాళాల సేకరణ ఊపందుకుంది. అమెరికా వాళ్ళ నుంచి సేకరించిన విరాళాల్ని జీవనికి పంపాలన్న ప్రాథమిక ఆలోచనలో ఆయన ఉన్నారు. ఇక నాకు మరింత ఉత్సాహం వచ్చింది.

పొద్దున్నే ఆహారంతో ఒక లారీ కర్నూలు బయలుదేరింది. అప్పటికి కర్నూలు కొంచెం కూడా తేరుకోలేదు. మన వాళ్ళు పాత బస్తీ ప్రాంతంలో పంపిణీ చేశారు. అలాగే కొన్ని కొత్త దుప్పట్లు పాత బట్టలు వగైరాలు కూడా...

తర్వాతి రోజు 3000 మందికి చపాతీలు చేయించి తిరిగి కర్నూలు పాత బస్తీకే పంపాము. శ్రీ సాయిదత్తా మ్యాక్ సొసైటీ ప్రతినిధి అనిత గారు వీటిని తయారుచేయించారు. ఆర్థికంగా, వస్తుపరంగా ఆమె జీవనికి భారీగా సహాయపడ్డారు.

రెండు రోజులపాటు విజయవంతంగా పంపిన అనంతరం మాకు పూర్తి ధైర్యం వచ్చేసింది. ఈ సారి ఒక గ్రామానికి పూర్తిగా వారం రోజుల భత్యం తీసుకుపోవాలని ప్లాన్ చేశాం. అందులో చీర, దుప్పటి, టవల్ , పంచె ఇతర నిత్యావసర వస్తువులు వుంచాము. బట్టలకే దాదాపు 1,50,000 అయింది. అయితే ఒక విశేషం ఏమంటే మొన్నటి వరకు కూడా మాదగ్గర రెడీ క్యాష్ అయితే ఎప్పుడూ లేదు. ఎప్పటికప్పుడు అప్పుచేస్తూ వచ్చాము. మన అప్పు తీరుతుందిలే అన్న ధీమా కూడా వచ్చింది. జీవని సంస్థ నుంచి 65,000 అప్పుతో ప్రారంభించాము. ( జీవని ప్రధాన కార్యకలాపాలు తల్లిదండ్రులు లేని పిల్లలకు సంబంధించినది కాబట్టి ఆ డబ్బు వాడుకోవడానికి వీలు లేదు. అందుకే అప్పు తీసుకున్నాము )

మహిళా బ్లాగర్లు కూడా మాకు బాసటగా నిలిచారు. అయితే ఇప్పుడు అంతా అయిపోయింది కాబట్టి చెబుతున్నాను. ఫండ్స్ కు సంబంధించి డీల్ చేయడం కత్తిమీద సాములాంటిది. తెలుగు బ్లాగర్లు డబ్బు మనకే పంపుతారా లేక ఎవరికైనా ఇస్తారా? మీరు డబ్బు జీవనికే పంపుతున్నారా అని అడగడానికి నాకు వెధవ మొహమాటం. డబ్బులంటే పడిచస్తున్నారు అనుకుంటారని నా భయం. బ్లాగర్లలో ఇంకా పూర్తి స్పష్టత లేదు. కామెంట్ల మధ్యలో ఎవరో ఒకరు దూరిపోయి అసలు ఈ జీవనిని మనం నమ్మవచ్చా? ఇంకా రకరకాల మార్గాలు ఉన్నాయి కదా అంటూ గందరళగోళం లో పడేస్తారు. బ్లాగర్ల నుంచి ఒక అమౌంట్ కు హామీ వస్తే ఆమేరకు అప్పులు చేయవచ్చు అన్నది మా ఆరాటం. ప్లానింగ్ కు సంబంధించి ఇది తప్పనిసరి. చివరి నిముషంలో ఆర్.కె. గారు లైన్లోకి వచ్చి మీరు భయపదకండి మీ పని మీరు చెసుకుపోండి అన్నారు. సహాయం చేస్తాం అని హామీ ఇచ్చి చివరకు వచ్చేసరికి వారి ఇబ్బందుల వల్ల సహాయం పొందలేని అనుభవాలు మాకు ఉన్నాయి. అందుకే ఈ సారి స్పష్టమైన హామీ కోసం పరయత్నించాము. మరుసటి రోజు నాబాధను ఆర్.కె. , భరాద్వాజ గారికి చెప్పారు. ఆయన పూర్తి భరోసాతో మెయిల్ వచ్చింది. రమణి గారూ, వరూధిని గార్లు కూడా ఆ పాటికి జీవనితో కలసి సహాయం చేయడానికి ముందుకు వచ్చారు.

సరే ఇదిలా నడుస్తుంటే, మరోపక్క ఆ రాత్రంతా ప్యాకింగ్ చేశాము. ఇది చాలా శ్రమతో కూడిన పని. దాదాపు ఇరవై మంది జీవని యూత్ సభ్యులు ఇందులో పాల్గొన్నారు. తెల్లవారు 4 గంటల వరకు పని చేయాల్సి వచ్చింది. మళ్ళీ పొద్దుటే ప్రయాణం. కానీ ఈ నిద్రలేని రాత్రి అందరికీ ఎనలేని తృప్తిని కలిగించింది. ఎక్కడా ఎవరికీ విసుగు లేదు. ఇంకా చేయాలన్న తపన. అలాగే మా కాలనీలోని మహిళలు కూడా ప్యాకింగ్ లో తమ వంతు సహకారం అందించారు.

అంతకు ముందురోజే పూర్తి సమాచార సేకరణ చేసి గుండ్రేవుల గ్రామానికి వెళ్ళాలని నిర్ణయించాము.

పొద్దున్నే 8 గంటలకు జిల్లా ఎస్పీ శ్రీ. ఎం.కె.సింగ్ మన వాహనానికి పచ్చ జెండా ఊపారు. ]

జూన్ లో కర్యకలాపాలు ప్రారంభించిన జీవనికి సరిగ్గా ఆరు నెలల వయసు కూడా లేదు. మనకు బాగా డబ్బున్న వాళ్ళ అండదండలూ లేవు, అయినప్పటికీ ఏమాత్రం తగ్గకుండా ఇంత పెద్ద కార్యక్రమం చేపట్టడం మాకు ఆశ్చర్యంగా అంపించింది. అయితే మా అందరిలో ఉన్న ఏకైక శక్తి సేవ చేయాలన్న తపన మాత్రమే. అలాగే మా మిత్ర బృందానికి మా అందరిపై ఉన్న నమ్మకం. మేము డబ్బులు దుర్వినియోగం చేయం అన్న నమ్మకాన్ని దాతల్లో కలిగించాము. అదే ఇంత ఎత్తున నిధుల సేకరణకు కారణం అయింది. ఇవన్నీ బేరీజు వేసుకుంటూ మా వాహనం గుండ్రేవుల వైపు బయలుదేరింది.

Read More

గాంధీ జయంతి రోజున కర్నూల్ నగరాన్ని వరద ముంచెత్తింది. నేను ఇంకా పేపర్ కూడా చూడలేదు. బ్లాగులు చూస్తుంటే రౌడీ రాజ్యంలో భరద్వాజ గారు వరద బాధితులకోసం మీరు ఏమైనా చేస్తున్నారా అంటూ అడిగారు. చేయగలిగినంత ఆర్థిక సామర్థ్యం మన సంస్థకు ఎక్కడ ఉంది అని నేను పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు. భరద్వాజ గారు చూస్తుండగానే విరాళాలు సేకరించడం మొదలు పెట్టారు. 10 గంటల సమయంలో జీవని యూత్ సభ్యుడు రఘు ఫోన్ చేసి, అన్నా వరద బాధితులకోసం ఏమైనా చేద్దాం అని అన్నాడు. సరే బియ్యం పాత బట్టలు సేకరించి ఒక లారీకి పంపుదాం ఈ మాత్రం ఖర్చుకు ఎవరో ఒకరు ముందుకు రాకపోరా అని అకున్నాను. జీవని సభ్యులందరినీ ఫోన్ లో సంప్రదించాను. అందరూ ఓకే అన్నారు.


మరుసటి రోజు క్లాక్ టవర్ వద్ద టెంటు వేశాము. అయితే మధ్యాహ్నానికల్లా మాకు దిమ్మతిరిగింది జీవని డోనార్లు, సభ్యులు కంటే ఇతర జనాలు పాతబట్టలు గుమ్మరించడం ఎక్కువ అయిపోయింది. చూస్తుండగానే అవి గుట్టలా పేరుకుపోయాయి.


మనుషులు ఎంత వికృతంగా ఉంటారో మరోసారి ఆ రోజు చూశాము. కొందరు ఇచ్చిన బట్టలు అప్పుడే బాత్రూం నుంచి తీసుకుని వచ్చినట్లు నీళ్ళు కారుతున్నాయి. మరికొంతమంది పాత బట్టలను పారవేయలేక పీడ వదిలించుకుందామన్నట్లు ఎందుకూ పనికి రాని బట్టలు పడవేసిపోయారు.( వీళ్ళు జీవనికి సంబంధించిన వ్యక్తులు కాదు ) అవి కనీసం మసి బట్టలుగా లేదా ఇళ్ళు తుడవడానికి కూడా పనికిరానంత అసహ్యంగా ఉన్నాయి. అక్కడ పబ్లిక్ కాబట్టి ఎవరు ఇచ్చినా తీసుకోవల్సి వచ్చింది.

కొద్దిసేపటికి జీవని యూత్ బ్రిగేడ్ అద్యక్షుడు సతీష్ వచ్చి అన్నా పిల్లలు పాపం పేటలో మరో కౌంటర్ ప్రారంభించాలని ఉత్సాహపడుతున్నారు అని చెప్పాడు. కేవలం బియ్యం మాత్రమే సేకరిద్దాం అని నిర్ణయించుకుని సరే అని చెప్పాము. అక్కడ సురేష్ రెడ్డి, చంద్ర మోహన్ ఆధ్వర్యంలో టెంటు ప్రారంభం అయింది. వీరిద్దరూ సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్సే.







మూడు గంటల ప్రాంతంలో SREENIVASA RAMANUJAN ENGINEERING COLLEGE CORRESPONDENT సాంబశివారెడ్డి, సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస రెడ్డి వచ్చారు. సాంబశివకు పరిస్థితి చెప్పాను. అన్నా ఇవన్ని వద్దుకానీ భారిగా ప్రయత్నం చేద్దాం. కాస్త పై రేంజిలో వ్యక్తులను కదిలిద్దాం. ముందు టెంటు ఎత్తేయండి అన్నట్లు చెప్పాడు. వెంటనే అక్కడ స్కూలు మూసేసి అందరం సమావేశం అయ్యాము. జీవని సలహామండలి చైర్మన్ జగదీశ్వర రెడ్డితో మాట్లాడాము. ఆయన 50 వేల వరకూ హామీ ఇచ్చాడు. ఇక కార్యక్రమం ఊపు అందుకుంది. ఇక అప్పుడు మొదలైంది అగ్రెసివ్ స్టెప్. సాంబశివ స్వతహాగా బాగా ధైర్యస్థుడు, ప్రాక్టికల్ కూడా. మరుసటి రోజు కర్నూల్కు ఓ 3000 వేలమందికి ఆహారం పంపాలని ప్రణాలిక సిద్ధం అయింది. అందరం ఆ పనిలో పడ్డాము.

Read More

Blog Archive

Followers

మాలిక: Telugu Blogs
haaram logo