మొత్తం మూడు వాహనాల్లో మేము బయలుదేరాము. ఒక క్యారేజి వాహనం, క్రూయిజర్, కారు. దాదాపు 20మంది. కోడుమూరు నియోజకవర్గంలోని గూడూరు మండలంలో గుండ్రేవుల వుంది. కర్నూల్ దగ్గర ప్లానింగ్ కోసమని నేను సాంబశివారెడ్డి కారులోకి ఎక్కాను. ఆ తర్వాత మిగతా రెండు వాహనాలు, మేము వేర్వేరు దారుల్లో గుండ్రేవుల వైపు వెళ్ళాము. మా ప్రయాణం దాదాపు తుంగభద్ర నదికి సమాంతరంగా సాగింది.
బహుశా గుండ్రేవుల గ్రామం నదికి ఒక కిలోమీటరు దూరంలో ఉందేమో. తుంగభద్ర ఒక చిన్న పాయలాగా మాకు కనిపించింది.
మేము ఊరిలోకి ఒకవైపునుంచి అడుగుపెట్టాము. అక్కడి పరిస్తితుల గురించి మాట్లాడుకుంటూ ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటున్నాము. సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస రెడ్డి ఫోటోలు చక చకా తీసేస్తున్నాడు.
కరెంటు స్థంభం పైభాగాన్ని గమనించండి అంతవరకు నీళ్ళు వచ్చాయట.
ఆ ఊహే మమ్మల్ని వణికించింది. ఇంతలో అటువైపునుంచి వచ్చిన మన వాళ్ళ నుంచి ఫోను. అన్నా క్యారేజి వెహికిల్ రోడ్డు చివరకు వచ్చి ఒక పక్కకు పూర్తిగా ఒరిగిపోయింది. అర్జెంటుగా ఏదైనా ట్రాక్టరు తీసుకునిరండి లేదంటే బోల్తా పడుతుంది అని. అప్పుడు మాలో టెన్షన్ మొదలైంది. గ్రామస్థుల ట్రాక్టర్ తీసుకుని బయలుదేరాము. అక్కడి నుంచి మళ్ళీ ఫోను. అన్నా జనాలు మన వాహనం దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఏమి చేయాలి అని ఆందోళనగా అడిగారు. దూరం నుంచి మొదట ఓ పదిమంది కనబడ్డారట ఆ తర్వాత మరో 5 నిముషాలకు వందలాది మంది పరిగెత్తుకుంటూ వస్తున్నారట. వాళ్ళ నుంచి ఫోన్ల మీద ఫోన్లు త్వరగా రమ్మని. అందరిని పొలంలో లైన్లో కూచోబెట్టమని చెప్పాము.
వెళ్ళేసరికి దాదాపు ఏడెనిమిది వందల మంది ఉన్నారు. మన దగ్గర 400 ప్యాకెట్లు మాత్రమే ఉన్నాయి. అందరికీ నచ్చజెప్పి కూచోబెట్టడానికి మా తల ప్రాణం తోకకు వచ్చింది. మా కష్టాన్ని వారికి వివరించాము. ఎంతగా శ్రమ పడి సహాయం చేస్తున్నామో నిదానంగా 20 నిమిషాల పాటు బ్రెయిన్ వాష్ చేశాము. ఒకే కుటుంబంలోని వారు ఇద్దరు కూచోవద్దని వారిని కోరాము. కొద్దిసేపటికి పరిస్థితి పూర్తిగా మా అదుపులోకి వచ్చింది. ఇద్దరు తలార్లు, సర్పంచ్, స్టోర్ డీలర్, కానిస్టేబుల్ మాకు పంపిణీలో సహాయపడ్డారు.
@ మౌళి " ఈ ప్రొబ్లెం ఊహించినదే....కాని మీరు 400 కుటుంబాలకు పంపిణీ అని తెలుసు కాబట్టి ...వీలయితే ముందు ఆ ఫ్యామిలీస్ లిస్ట్ తీసుకొని... అక్కడికి వెళ్ళాక లిస్ట్ చదివి ఇవ్వవచ్చు కదా? " మౌళి గారు జీవని బ్లాగులో పెట్టిన కామెంటు ఇది. అక్కడి ప్రభుత్వ యంత్రాంగం ఎంత అసమర్థంగా పనిచేసిందో చెబితే మీరు జీర్ణించుకోలేరు. ఆ మాత్రం లిస్ట్, బాధిత గ్రామాల వివరాలు, అధికారులు, పోలీసుల సహాయం అందించి వుంటే చాలా పద్ధతిగా బాధితులకు ఎంతగానో లబ్ది చేకూరేది. అసలు ప్రభుత్వేతర సంస్థలు, వ్యక్తులు గుడ్డిగా గ్రామాల్లో దూరిపోయి పని చేయడం వల్ల పెద్ద ముప్పు తప్పింది. లేకపోతే మనం ఆకలి చావులు చూడాల్సి వచ్చేది. ఈ వైఫల్యాలను ఎలా సవరించివుండవచ్చో మరో టపాలో మాట్లాడుకుందాము.
గ్రామస్థులందర్నీ వరుసలో కూచోబెట్టాము కదా... మా బ్రెయిన్ వాష్ వాళ్ళ మీద బాగా పనిచేసింది.
కుటుంబానికి ఒకరు మాత్రమే కూచున్నారు. అప్పటికి పూర్తిగా చీకటి పడిపోయింది. కారు ఆన్ చేసి లైట్ల వెలుగులో
పంపిణీ మొదలుపెట్టాము.
పంపిణీలో ముందుగా ఓ నలుగురికి ప్రాధాన్యం ఇచ్చాము. ఆ నలుగురు... వారికి ఒక తెప్ప ఉండేదట. నీటి మట్టం పెరిగిపోయి ఇళ్ళమీద చెట్ల మీద ఉన్నవారిని దాదాపు 400 మందిని ఆ నలుగురే రక్షించారట.
వారిని మేము మనస్ఫూర్తిగా అభినందించాము. ఆ తర్వాత ఇద్దరు వికలాంగులకు ఇచ్చాము.
అప్పుదు పంపిణీ మొదలుపెట్టాము. ఆ ఊరి తలార్లు, సర్పంచ్, కానిస్టేబుల్ నియంత్రణతో పంపిణీ సజావుగా సాగింది. చివర్లో అక్కడ మాకు సహాయపడిన ప్రజలు ఓ 20 మంది ఉంటారు వారికి మిగతా అన్ని సరుకులు అందజేశాము. సరైన గ్రామానికి సరైన సమయంలో సహాయం చేశాం అన్న తృప్తి మాకు లభించింది. కానీ జీవని యూత్ బ్రిగేడ్ పడిన కష్టానికి సంస్థ మొత్తం వారికి రుణపడి ఉంటుంది. వారి సహాయమే లేకపోతే ఈ కార్యక్రమం మొత్తం నిస్సందేహంగా అట్టర్ ఫ్లాప్ అయ్యేది. వాళ్ళ కమిట్ మెంట్ కు నిజంగా మేమంతా ముగ్ధులం అయ్యాం. వాళ్ళు తప్ప శారీరకంగా కష్టపడే సామర్థ్యం మా బ్యాచ్ లో ఎవరికీ లేదు. అప్పుడు మా వాహనాన్ని గ్రామస్థులు, ట్రాక్టర్ సహాయంతో బయటకు లాగాము. అందరం ఇంటి దారి పట్టాము. మరచిపోయాను, కర్నూల్ నుంచి ఇద్దరు టీచర్లు, ఆకాశవాణిలో పనిచేసే సుధాకర్ గార్లు కూడా మాతో పాటే వచ్చి సహాయం చేశారు.
చివరగా ఒక్క మాట. ఆ చేతులు నాకు తరచుగా గుర్తుకొస్తుంటాయి.
సాయం కోసం చాచే చేతులవి. వ్యాన్ లో నుంచి ఏమి ఇస్తారో అన్న ఆశ! ఇంకా వీరి దగ్గర ఏమేమి ఉన్నాయో అవన్నీ మనకు దక్కితే బాగుండు అన్న ఆశ. ఆతృత, ఆందోళన, దొరకని వారిలో నిరాశా నిస్పృహలు. ఆఖర్లో మా వ్యాన్ ను చుట్టుముట్టిన ఆ ఇరవైమంది చేతులు చాచిన దృశ్యం నా కళ్ళ ముందే ఉంది. అది గుండెను పిండుతుంది. అంతటి దుర్భర పరిస్థితులు మనకే వస్తే... తల్చుకుంటేనే భయం అనిపిస్తుంది.
వరద వారి జీవితాల్లో కల్లోలం రేపింది....
పేదా ధనిక తేడా లేదు. రెండు రోజుల కిందట ఆ ఊర్లోనూ షావుకార్లు ఉన్నారు, పేదలు ఉన్నారు. రెడ్డి ఉన్నాడు, మాలా మాదిగ ఉన్నారు. మేము పోయిన రోజు అందరూ దీనులే. ఎవరి దగ్గరా తిండి గింజలు లేవు. ప్రకృతి - విధ్వంసంతో సమసమాజాన్ని సృష్టించింది. కానీ మనిషి అంత త్వరగా మార్పు చెంది మానవత్వాన్ని నింపుకుంటాడా? మరణం అంచు వరకూ వెళ్ళి వచ్చిన ఆ ఊరి ప్రజల్లో మరో వారానికి మళ్ళీ రకరకాల వైషమ్యాలు తారతమ్యాలు మొదలవుతాయి. ఆ ఊరి వాళ్ళే కాదు మనిషి అన్న వాడి గురించి నేను చెబుతున్నాను.
మనిషి అంత త్వరగా మార్పు చెంది మానవత్వాన్ని నింపుకుంటాడా?
అలా మనిషి మానవత్వాన్ని నింపుకునే దానికేనా అన్నట్లు ఈ ప్రకృతి విలయతాండవం చేసేది.
మరి మనిషి ఇప్పటికైనా మారతాడా?లేక రకరకాల వైషమ్యాలు తారతమ్యాలను బయటపెట్టుకుంటాడా? అయినా మారితే మనిషెందుకవుతాడు కాడా దేవుడు.
Great job Jeevani gaaru. I Appreciate your and your team efforts.
మీ తీవ్ర కృషి ఫలించాలని కోరుకుంటున్నాను. మీ సేవా ధ్రుక్పధానికి జోహార్లు.