నెట్ ఇబ్బందులు ఇతర పనులవల్ల మొన్నటి కార్యక్రమ విశేషాలను మీముందు ఆలశ్యంగా ఉంచడం జరుగుతోంది. మూడు సంవత్సరాల కిందట శంకుస్థాపన రోజున మేము ఉన్నాము, జీవని మరో మైలురాయి సాధించిన రోజున కూడా మేము ఉంటాము అని బ్లాగర్ రాజ్‌కుమార్ గారు ముందే చెప్పారు. అనుకున్నట్టుగానే రాజ్ దంపతులు, కార్తీక్, రహమాన్ గార్లు బెంగళూరు నుంచి వచ్చారు.

ఆతర్వాత జరిగింది రాజ్ మాటల్లోనే చదవండి...


ఎన్ని సార్లు వెళ్ళినా జీవని కి వెళ్ళొచ్చిన ప్రతి సారీ సరికొత్త అనుభవాలు ఙ్ఞాపకాలై ఉండిపోతాయి నాకు. పోయిన ఏడాది అనుకున్న ప్రయాణం అలా వాయిదాల మీద వాయిదాలు పడి మొన్నటికి కుదిరింది.

ఈ సారి ఎప్పుడూ వచ్చే మన వాళ్ళలో చాలా మందికి కుదరక పోయినా, అనుకోని ట్విస్టులతో సరదాగానే సాగింది. బెంగుళూరు నుండి నేనూ మా ఓనర్ గారూ, కార్తీకూ, రెహమానూ శనివారం పొద్దున్నే బయలెళ్ళాం.

మా ఆచారం ప్రకారం, ఈ సారి కూడా దారి మరిచిపోయి వీలైనంత ఎక్కువ దూరం ప్రయాణించి జీవని కి చేరుకున్నాం. రెండేళ్ళ క్రితం పునాది రాయి వేసినప్పుడు చూసిన ప్రదేశమేనా ఇదీ? అనిపించేలా చుట్టూ ప్రహారీ గోడ, దాన్ని ఆనుకొని మొక్కలు, ఓ పక్క స్కూల్, ఆ పక్క బోయ్స్ హాస్టల్, దాని పక్కనే ఇప్పుడు ప్రారంభోత్సవానికి సిద్దం గా ఉన్న గర్ల్స్ హాస్టల్. "ఆహా..." అనుకున్నాం. ప్రతి సారీ మేం వెళ్ళగానే చుట్టుముట్టి అల్లరి చేసే పిల్లలు, ఈ సారి మాత్రం అలా పలకరించి తిరిగి వాళ్ళ వాళ్ళ పనుల్లో బిజీ అయిపోయారు. కొందరు అమ్మాయిలు గుడ్డముక్కలతో గులాబీలు చేస్తుంటే, మరికొందరు వాకిలి అలుకుతూ, ఇంకొందరు పూలమాలలు కడుతూ, పరిసరాలు శుభం చేస్తూ బిజీ బిజీగా  కనిపించారు. కొందరు అబ్బాయిలు , అమ్మాయిల కోసం గోరింటాకు తెచ్చి పేద్ద బండరాయితో నూరుతూ ఉంటే, చిన్నప్పుడు  మా అమ్మ , పిన్ని ల కోసం గోరింటాకు తెచ్చి నూరి న రోజులు గుర్తొచ్చాయి.
ఇవన్నీ మరునాడు జరగబోయే ఫంక్షన్  కి ఏర్పాట్లన్న సంగతి అర్ధమయ్యి   భోజనాలు చేసి  ఎవరో మత్తు మందు ఇచ్చినట్టుగా బజ్జున్నాం. సాయంత్రం అలా ఇస్కాన్ టెంపుల్ కి వెళ్ళి హరేకృష్ణ.. అనుకొని తిరిగొచ్చేసరికి, పక్కనే ఉన్న ఇంజినీరింగ్ కాలేజ్ పిల్లల
సహాయంతో  ఒక పేద్ద రంగుల ముగ్గేసే బృహత్ కార్యక్రమం నడుస్తుంది అక్కడ. ఆ ముగ్గు చుట్టూరా తిరుగుతూ నాలుగు ఫోటోలు తీసి కబుర్లు చెప్పుకున్నాం.
 

  అప్పటి వరకూ ఏర్పాట్లూ, గ్యాప్ లేకుండా వచ్చే ఫోన్ లతో  తీరిక లేకుండా ఉన్న ప్రసాద్ గారూ -సునంద అక్కలు కూడా  మాతో కలిశారు.


రాత్రి  10 గంటల సమయం లో  శివ కుమార్ అనే చలాకీ బుడ్డోడు,బయట ఆడుకొని నిద్రపోయిన ఇంకో చిన్న పిల్లాడిని  ఎత్తుకొని  మేడ మీది గది లో పడుకోబెట్టడానికి మెట్లెక్కుతుంటే మేమంతా అలా చూస్తూ ఉండిపోయాం."పిల్లలు తొందరగా
ఎదిగిపోతున్నారు " అని చూడగానే అనుకున్నాం గానీ "బాధ్యత గల కుటుంబ సభ్యులు" గా ఎదుగుతున్నారని  అప్పుడే తెలుసుకున్నాం. ఆ ఏజ్  లో  నాకంత మెచూరిటీ ఉన్నట్టు నాకయితే గుర్తు లేదు, తమ్ముడి పుట్టిన్రోజు నాడు  నాకు కొత్త బట్టల్లేవని ఏడ్చి కొనిపించుకున్న  అల్లరితనం, రోజంతా  కొట్టుకుని  చివరాఖర్న తన్నులు తిన్న తింగరితనం తప్ప.పిల్లని ఈ  రీతి లో  పెంచుతున్నందుకు మనసు లో ఓ సారి దండం పెట్టుకున్నాను.

మరుసటి రోజు  పిల్లలు ఇచ్చే పెర్ఫార్మెంస్ లని ఓ సారి రివ్యూ చేసి, కామెడీ స్కిట్ లో  కొంచెం కరివేపాకు వేసి, రిహార్సల్స్ అన్నీ అయ్యాక   రాత్రి  ఒంటిగంటకెపుడో   మేం నిద్రపోయాం. స్టాఫ్ మా త్రం తెల్లవార్లూ డెకరేషన్ స్  చేస్తూనే ఉన్నారు.

పొద్దున్నే   తెలివొచ్చినాగానీ  బద్దకం గా ఇంకా మంచం మీదున్న  నాకు"సార్... ఈ మంచం తియ్యండి, లెగండి ఇంక పడుకున్నది చాలు" అన్న మాటలు  కొంచెం కరకు గా వినిపించడం తో  కార్తీక్ నీ, రెహ్మాన్ నీ లేపి, ఏదో‌డౌట్ వచ్చి వెనక్కి తిరిగి చూశా, మిర్చి లో ప్రభాస్ లాగా మొహానికి తువ్వాలు కట్టుకుని అరుస్తున్నది "శీనన్న" అని కనిపెట్టి షాకయ్యాం అందరం.(శీనన్న   వస్తున్నట్టు మాకు తెలవది) ఆ పక్కనే‌ సురేష్ గారు. ఓ సారి కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్  మని అరిచి కిందకి
ఉరికాం. శీనన్న వచ్చాక ఎలా ఉంటాదో మన జనాలకి బాగా తెలుసు కదా. రచ్చ రచ్చ అన్నమాట.
 
డార్మిటరీ ఓపెనింగ్ సెర్మనీ  విశాల ఫెర్రర్ గారి చేతుల మీదుగా  అయింది.
 
 
 
 
 ఊరికి దూరం అయినా  మూడొందల మంది కి పైగా జనాలు వచ్చారు.
పిల్లలు చేసిన గ్రూప్ డ్యాంస్ లు (వాళ్ళే కంపోజ్ చేసుకున్నారు) ఆకట్టు కోగా, కామెడీ స్కిట్  జనాల్లో నవ్వుల సునామీ ని  సృష్టించింది.
 
 
 
 

  ప్రసాద్ గారి అధ్యక్షతన  జీవని కుటుంబ సభ్యులంతా మాట్లాడారు. బ్లాగర్ల ప్రతినిధి గా  స్టేజెక్కి కూర్చున్న శీనన్న, మైక్ పట్టుకొని  నించొని ఇచ్చిన  స్పీచ్ కి   సభ మొత్తం షేక్ అయ్యింది. తెలుసుగా... ఆ వాయిస్ కి బేస్ ఎక్కువ,మాటలకి పదునెక్కువ.
 


విజయ్ మోహన్ గారు ఈ సారి  కూడా వచ్చి కలిశారు. ఇంటికి రమ్మని  ఎప్పటిలానే  పిలిచారు. సమయం లేక వెళ్లలేకపోయాం. సభానంతరం  క్లాస్ రూం  బెంచ్ ల మీద కూర్చొని భోజనం చెయ్యడం ఒకరకం ఆనందాన్నిస్తే, అక్కడ జరిగిన మరో
చిన్న సంఘటన  ఇంకో  రకమైన  ఙ్ఞాపకాన్నిచ్చింది. మా ముందు బెంచ్ లో కూర్చుని భోజనం‌చేస్తున్న  ఓ పిల్లాడి దగ్గరకి , రైస్ ప్లేట్ తో వచ్చిన  ఓ‌ అమ్మాయి (మూడో, నాలుగో చదువుతుంది అనుకుంటా) "ఏరా... పప్పు వేస్కొని తింటున్నావా
అయి..పోయావ్. అంతే ఇక" అని  ఓ సీరియస్ లుక్కిచ్చి  పక్క  బెంచ్ మీద కూర్చుంది. ఇంకో అబ్బాయి వచ్చి.."నువ్ పప్పు తినకూడదని చెప్పారు కదరా...బుద్ది లేదా? తినేస్తున్నావ్" అని తిట్టాడు. వాడు  కలిపిన పప్పు ముద్దని ఏడుపు మొహంతో  పక్కన పెట్టేశాడు. విషయం‌ఏంటని  అడిగితే చెప్పాడు.."వాడినీ కుక్క కరిచింది సార్.. గాయం మానే వరకూ పప్పు తినకూడదు అన్నారు. వీడు  తినేస్తున్నాడు"అని అసలు సంగతి చెప్పాడు. వాళ్ళ అభిమానం, స్నేహం చూసి ఎంత ముచ్చటేసిందో.!!!

సాయంత్రం ఐదింటికి శీనన్న, విజయ్ మోహన్ గారు, సురేష్ గార్లకీ, జీవని కుటుంబం మొత్తానికీ వీడ్కోలు చెప్పి , మళ్ళీ వచ్చేవరకూ  సరిపయే అనుభవాలని  నింపుకొని తిరుగు ప్రయాణమయ్యాం.

***********************************************************************************************************************
జీవని ప్రారంభం నుంచి బ్లాగర్లు ఇస్తున్న ఆర్థిక నైతిక మద్దతు మరువలేనిది. జీవనిని నిలబెట్టడంలో మీ అందరి పాత్ర ఎంతో ఉంది. మీకు పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.

on
categories: | edit post

1 Responses to బ్లాగర్లు జీవని కుటుంబసభ్యులు

  1. durgeswara Says:
  2. shubha samklpam rupudaalchimdi
    abhinamdanalu

     

Blog Archive

Followers