తల్లిదండ్రులు అందరు తమ పిల్లల్ని అందర్నీ సమానంగా చూస్తారా? బహుశా చూడలేరేమో! మధ్య ఉన్నత తరగతి వర్గాల గురించి చెప్పడం లేదు కానీ, మా బడిలో చదివే పిల్లల తల్లిదండ్రులు ఎలాంటివారో మీకు చెప్తాను. పేదరికంలో ఆడపిల్లగా పుట్టడం ఎంత బాధాకరమో మా బడిలో పిల్లల్ని చూస్తే తెలుస్తుంది.
మొదటిది ఆడపిల్లకు తమ్ముడో చెల్లో పుట్టారనుకోండి బడి ఎగరగొట్టి వారి ఆలనా పాలనా చూడాలి. అలాగే ఇంటి పనిలో సగం ఎలాగూ చేస్తుంటారు. అన్నిటికంటే ముఖ్యంగా ఒక ఇంటిలో అమ్మాయి, అబ్బాయి ఉన్నపుడు అమ్మాయిని ప్రభుత్వ బడికి పంపుతారు అబ్బాయిని కాన్వెంటుకు పంపుతారు. కాన్వెంట్లో వాళ్ళు గొప్పగా చదువుతారని వీళ్ళ భ్రమ. కానీ అసలు విషయం ఏమంటే మా దగ్గర చదివే ఆడపిల్లలు చాలా తెలివిగా ఉంటారు. వారికంటే బాగా చదువుతారు.( మా గొప్పతనం కాదు గానీ ఎంత చిన్న చూపు చూసినా వారిలో చదువు పట్ల మమకారం కనిపిస్తుంది. దాని ప్రతిఫలమే వాళ్ళు బాగా చదవడం ) అయినప్పటికీ పుస్తకాలు కొనివ్వడం దగ్గర్నుండీ రకరకాలుగా ఈ వివక్ష కొనసాగుతూనే ఉంటుంది.
తల్లిదండ్రులు కూడా అందరూ దినసరి కూలీలే. పెద్ద సంతానం అమ్మాయి అయితే, తమ్ముడు లేక చెల్లిని నడిచే వయసు నించి బడికి అక్కతో పాటు పంపుతారు. చిన్న పిల్లలు వచ్చినప్పట్నుంచి ఏదో ఒక గొడవ చేస్తుంటారు. వాళ్ళకు బడిలో ఉన్నత సేపూ ముక్కు తుడుస్తూ మూతి తుడుస్తూ వారి సేవలోనే సరిపోతుంది. కానీ ఏ ఒక్క మగపిల్లవాడు కూడా తన తమ్ముడినో చెల్లినో బడికి తెచ్చిన సందర్భాలు లేవు. మగపిల్లలు మహరాజుల్లా పెరుగుతుంటారు.
మా బడికి కాస్త దూరంలోనే హైస్కూలు ఉంది. నా పాత విద్యార్థులు ఇప్పుడు 8, 9 తరగతులు చదువుతున్నారు. అప్పుడప్పుడు వచ్చి పలకరిస్తుంటారు. ( ఈ రోజు వచ్చారు అందుకే రాస్తున్నాను) ఇంట్లో రకరకాల కష్టాలు ఉన్నా, దీటుగా ఎదుర్కొని చదువులో ముందంజలో ఉన్న ఆ చిట్టితల్లుల్ని చూస్తే మనసు త్రుప్తిగా ఉంటుంది.
అనుక్షణం ఆనందంగా జీవించండి వీలైనంత మేర సేవ చేయండి...
Join hands with...
JEEVANI
JEEVANI
......FOR UNCARED
0 వ్యాఖ్యలు