మిత్రులారా, మా బడిలో నలుగురు తల్లీదండ్రిలేని పిల్లలు ఉన్నారు.వారందరూ 1,2 తరగతులు. వారిని జీవనిలోకి ఎందుకు తీసుకోలేదంటే ప్రస్తుతం వారు ప్రభుత్వం నిర్వహించే బాలసదన్లో ఉంటున్నారు. వారిని తీసుకోవాలంటే ప్రభుత్వ లాంచనాలు ఉంటాయి, అలాగే సెలవుల్లో వారి రక్షణ ఒక ఇబ్బంది. జీవని విద్యాలయం మొదలయ్యాక వారిని అక్కడికి చేర్చాలన్నది నా ఆలోచన.సరే మొన్న ఇద్దరు పిల్లలకు దుప్పట్లు తెచ్చి ఇచ్చాను. మరుసటిరోజు ప్రార్థన కాగానే నా క్లాస్లో ఉన్నాను. ఈ లోపు 2వ తరగతి పిల్లలు వచ్చి సార్ కమల ( పేరు మార్చాను ) ఏడుస్తోంది. మేడం కూడా ఏడుస్తున్నారు అని పిల్లలు చెప్పారు. నాకు అర్థం కాలేదు. మా 5 వ తరగతి పిల్లల్ను విషయం కనుక్కురమ్మని పంపాను.విషయం ఏమంటే దుప్పట్లు తీసుకున్నందుకు హాస్టల్ వాచ్ విమెన్ కమలను చితకబాదింది. ఆ అమ్మాయి ఏడుస్తుంటే మా మేడం ఏడ్చేసింది. నిజానికి ఆ నలుగురు పిల్లల్ని మా స్టాఫ్ చాలా బాగా చూసుకుంటారు. బట్టలు, పుస్తకాలు, చిరు తిండ్లకు డబ్బులు... ఇలాంటి విషయాల్లో మిగతా పిల్లలతో పోల్చుకుని తమకు లోటు ఉందన్న సంగతి వారికి లేకుండా చూస్తాం. వారి క్లాస్ టీచర్ అయిన మేడం తో ఇంకా ఎక్కువ అటాచ్మెంట్ వారికి ఉంది. దాంతో ఆమె తట్టుకోలేకపోయారు.ఎందుకు కొట్టిందని అడిగితే బయట వాళ్ళు ఇచ్చేవి తీసుకోవద్దు, హాస్టల్ మేడం ( సూపరిండెంట్ ) చెప్పింది కదా? అయినా తీసుకుంటారా? తక్కువ అయితే మమ్మల్ని అడగాలి కానీ.. అని.నేను హాస్టల్ వద్దకు వెళ్ళి అడిగితే ఆమె పిల్లల్ని కొట్టడం తన హక్కులా మాట్లాడింది. ఆ రోజు సోమవారం గ్రీవెన్స్ డే, అదే ఆవేశంలో వెళ్ళి కలెక్టరు గారికి ( కలెక్టరాఫీసు మాకు కూతవేటు దూరం ) ఫిర్యాదు చేయాలని అనుకున్నాను. ఆ వాచ్ విమెన్ పరిస్థితిని గురించి పిల్లల్ని అడిగాను. ఆమెకు భర్త చనిపోతే ఉద్యోగం ఇచ్చారు. నాకు ఆవేశం తగ్గింది.హాస్టల్ సూపరిండెంట్ ఇక్కడ ఇంచార్జిగా పని చేస్తోంది. ఆమె అసలు ఉద్యోగం మరోచోట. దాంతో హాస్టల్ మీద పర్యవేక్షణ అసలు లేదు. ఆమె ఫోన్ నెంబర్ తీసుకుని వెంటనే కలిశాను. ఫిర్యాదు చేశాను. మరోసారి ఇలా జరగనీయకుండా చూడాలని చెప్పాను. ఆమె తమకు సిబ్బంది కొరత వల్ల కింది స్థాయి ఉద్యోగులపై నియంత్రణ లేకుండా పోయిందని ఈ విషయాన్ని మనసులో పెట్టుకోకండి అని సర్ది చెప్పింది.తర్వాత స్కూల్ కు వచ్చాక వాచ్ విమెన్ అరాచకాలు పిల్లలు చెప్పారు. పిల్లలతో ఇంట్లో పనిచేయించడం, ఆమె కొడుక్కు సేవలు చేయించడం, పిల్లలకు ఎవరైనా స్వీట్లు, వస్తువులు ఇస్తే లాక్కోవడం లాంటివి చేస్తుందట. వీటిలో ఏది రిపీట్ చేసినా నాకు చెప్పండి అని పిల్లలకు ధైర్యం, ఐకమత్యం గురించి కొద్దిసేపు క్లాస్ ఇచ్చాను.కొసమెరుపు ఏమంటే కమలతో పాటు మరో అమ్మాయికి కూడా దుప్పటి ఇచ్చాను కదా? కమల ఆ అమ్మాయికి సార్ ఇవ్వలేదు, నేనే ఇచ్చాను అని మొత్తం విషయాన్ని తన మీదే వేసుకుని తన స్నేహితురాలిని దెబ్బల్నుంచి రక్షించడం.ఇలాంటి హింసల్ని భరిస్తూ పిల్లలు ఎదురీదడం ఎంత బాధ అనిపిస్తుంది? వచ్చే విద్యా సంవత్సరంలో నలుగురు పిల్లల్ని జీవనిలోకి తీసుకుంటాం అని హాస్టల్ సూపరిండెంట్ కు చెప్పాను.అలాగే హాస్టళ్ళలో చిన్న పిల్లలపై హైస్కూల్ విద్యార్థుల ఆగడాలు ఇవన్నీ ఉంటాయి. ఒకటో తరగతి నుంచి కూడా ప్రతి క్లాసులోనూ ఒక దుండగ బ్యాచ్ ఉంటుంది. బలహీనులైన పిల్లల్ని ఏడిపిస్తుంటారు. తల్లిదండ్రులు పిల్లల్ని ఈ వివరాలు అడిగి కనుక్కోవల్సిందిగా మీ అందర్నీ కోరుతున్నాను. పిల్లలు సాధారణంగా పోట్లాడుతుంటారు. అది మామూలే. కానీ టార్గెట్ చేసి ఏడ్పిస్తున్నపుడు పేరెంట్స్ తెలుసుకోవాలి. చిన్న విషయం అని వదిలేస్తే పిల్లలు మానసికంగా చిత్రహింస అనుభవిస్తుంటారు. చదువు సంగతి పక్కన్ బెడితే ముందు వారి శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది.డైరెక్టుగా అడగకుండా మెల్లగా వివరాలు సేకరించండి. మీకు చెబితే రాద్ధాంతం అవుతుందని, అల్లరి పిల్లలు ఇంకా ఏడిపిస్తారని పిల్లలు భయపడతారు.మీ అందరికీ క్లాస్ పీకానేమో మరి. మన నోటీస్ కు తక్కువగా వచ్చే హింస అని అనిపించి రాశాను.on
categories: | edit post

3 వ్యాఖ్యలు

 1. Even I have heard of horrific scenes in the Childrenz hostels. People like you should take the initiative and drive the effort to eliminate this kind of violence

   
 2. ఈ మధ్య మా దగ్గరలోని కొమరాడ మండలం లోని బ్రిడ్జి స్కూల్ లో కుడా ఇలాంటి సంఘటనలు జరిగాయి. పేపర్లో రాసినా నో యాక్షన్. ఇలా ప్రతి హాస్టల్ లో దుర్జన్యాలు జరుగుతూనే వున్నాయి. ఆఫీసర్ల లంచాగోమ్దితనం వలన ఇవి సాధారణ కేసులుగా చుదబడుతూ గత్యంతరం లేక చదువుతున్నారు పేద పిల్లలు.

   
 3. Anonymous Says:
 4. ...literally very bad,very hurtig, ...solution for this is not just a legel action on the culprits..... I think we can bring change in such hard heart.
  dear jeevani friends think in this way

   

Blog Archive

Followers