మిత్రులారా పిల్లలతోపాటు మేమంతా జీవని ఇల్లు ( రోటరీ పురం గ్రామం ) లో చేరి సంవత్సరం దాటింది. ఏడాదిలో సాధించిన ప్రగతి...
1) గతంలో పిల్లలను ప్రైవేట్ రెసిడెన్షియల్ స్కూల్లో పెట్టాము. ప్రస్తుతం పిల్లలకు మెరుగైన భోజన, వసతి , విద్యా సౌకర్యాలు కల్పించగలుగుతున్నాము.
2) పిల్లలతో దాతలను కలుపుతూ మానవసంబంధాలు, సమాజం పట్ల పాజిటివ్ దృక్పథాన్ని అలవరుస్తున్నాము.
3) జీవని విద్యాలయం ప్రారంభించాము. అయితే ఇది కేవలం 2వ తరగతి వరకే. రాబోయే 4-5 సంవత్సరాల్లో 10వ తరగతి వరకు విస్తరించనున్నాము.
4) త్వరలోనే ఈ-బడి కార్యక్రమం ప్రారంభిస్తున్నాము. వివరాలు ఇక్కడ

జీవని లక్ష్యాలు
ప్రస్తుతం 36 మంది పిల్లలు ఉన్నారు. భవిష్యత్తులో మరికొంత మందికి అవకాశం ఇవ్వడం.
3-5 తరగతి గదుల నిర్మాణానికి నిధులు సమకూర్చుకోవడం ( 4 లక్షలు, అంచనా మాత్రమే... )
జీవని విద్యాలయం శాశ్వత భవనం నిర్మించుకోవడం
పిల్లలకు కొత్త వసతి గదులను నిర్మించడం

సాధకబాధకాలు
ఇప్పటివరకూ పెద్ద సమస్యలు ఏవీ ఎదుర్కోలేదు. అయితే నెలవారీ ఖర్చు విషయంలో మాత్రం కత్తి మీద సాములా ఉంది పరిస్థితి. నెలకు దాదాపు 60-80 వేలు ఖర్చు ఉండగా రెగ్యులర్గా వచ్చే విరాళాలు 40 వేలు మాత్రమే. మిగతావి దాతలు వివిధ సందర్భాలను పురస్కరించుకుని ఇస్తున్న విరాళాలతో నడుస్తోంది. ఈ సంవత్సర కాలంలో ఒకేఒక్కసారి పూర్తి గడ్డుపరిస్థితి ఎదుర్కొన్నాము. చేతిలో, బ్యాంకులో డబ్బులు నిల్. రెండోరోజు విదేశాల్లో ఉంటున్న ఒక బ్లాగర్ 40 వేలు పంపారు. ఆ తర్వాత ఎప్పుడూ ఇబ్బంది కలగలేదు. ప్రస్తుతం ప్రతి నెలా 5000/- జీవని పేరు మీద డిపాజిట్ చేస్తున్నాము. అలాగే 1 లక్ష రూపాయలు విలువైన మినరల్ వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేసాము.

ధన్యవాదాలు
ముందుగా ఈ క్రెడిట్ మొత్తం జీవని ప్రధాన కార్యదర్శి, శ్రీనివాస రామానుజన్ ఇంజనీరింగ్ కళాశాల కరస్పాండెంట్ ఆలూరు సాంబశివారెడ్డిగారికి దక్కుతుంది. జీవనిని సందర్శించిన బ్లాగర్లందరికీ సాంబశివారెడ్డి పరిచయమే. జీవని ఇల్లు నిర్మాణానికి, క్లాస్ రూములు ఇంకా ఇతర వసతులకు ఆయన ఎంత ఖర్చు చేసారో మొదట నీటుగా రాసాము, అయితే అది లెక్కకు మించి పోయింది. 40లక్షలకు పైగా ఖర్చు అయ్యింది.  ఆ తర్వాత జీవనికి వెన్నెముకలాంటివారు బ్లాగర్లు. జీవని బ్లాగులోని రాతల్ని ఆధారంగా మమ్మల్ని నమ్మి వేలకు వేలు  విరాళంగా పంపారు... పంపుతున్నారు.  ఇక క్రమం తప్పకుండా నెలకు 100/- నుంచి 2000/- వరకూ విరాళం ఇచ్చేవారు ఉన్నారు.  వీరందరి పేర్లు, వీరి గురించి రాయాలని ఉంది కానీ చాలా మందికి తమ పేర్లు బహిర్గతపరచడం ఇష్టం లేదు. వారి మనోభావాలను గౌరవిస్తూ పేర్లు ప్రచురించలేకపోతున్నాము.ఇక స్థానికంగా అనంతపురంలో ఉంటూ  ప్రతి విషయంలోనూ మమ్మల్ని నడిపించే బృందం మరొకటి ఉంది.

అందరికీ పిల్లల తరఫున ధన్యవాదాలు.

మీ అందరి అంచనాలకు అనుగుణంగా క్షేత్ర స్థాయిలో పారదర్శకంగా, కష్టపడి పనిచేస్తాము. ఇదేమాట ప్రతి సందర్భంలోనూ చెప్పాము ఇప్పుడూ చెబ్తున్నాము. దాతలు విరాళంగా పంపే ప్రతి రూపాయి పిల్లల కోసమే ఖర్చు అవుతుంది.

చివరగా... వీధిబాలలపైన ఎన్నో అకృత్యాలు జరుగుతున్నాయి. అడుక్కోవడం కోసం కొందరు పిల్లల అవయవాలు తీసివేయడం, పిల్లలకు అనారొగ్యం ఉందని చూపడానికి వారికి మత్తుపదార్థాలు ఇవ్వడం ఇంకా ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి. వీటిని ఎదుర్కుని పిల్లల్ని రక్షించి వారికి మంచి జీవితాన్ని ఇవాలి. అయితే ఆ స్థాయి ఇంకా జీవనికి లేదు. భవిష్యత్తులో మనకు అంతబలం చేకూరాలని కోరుకుంటున్నాము.

మీ అందరికీ  మరోసారి ధన్యవాదాలతో,
జీవని 

on
categories: | edit post

2 వ్యాఖ్యలు

 1. జీవని కుటుంబలో ఒకడినైనందుకు ఆనందంగా ఉందండీ.
  అనుకున్న లక్ష్యాలన్నీ చేరుకోవాలని కోరుకుంటున్నాను.

  సాంబశివారెడ్డి గారికీ, మిత్రులకీ అందరికీ ధన్యవాదాలు ః)

  పోస్ట్ రిపీట్ అయింది సరి చెయ్యండి

   
 2. karthik Says:
 3. అప్పుడే ఏడాది గడిచిపోయిందా??

  ప్రసాద్ గారూ,

  పారదర్శకంగా మీరు జీవనిని నిర్వహించే విధం చూస్తే ఎవరైనా జీవనికి సహాయం చేశ్తారు. బ్లాగర్లు కాకపోతే మరొకరు ఇచ్చేవరు. మీరు, సాంబశివారెడ్డి గారు, మిగిలిన జీవని టీం, ముందు మేము చేసేది అత్యల్పం.

   

Blog Archive

Followers