ఎన్నికల విధులకు వెళ్ళిన నాకు ఎదురైన కొన్ని అనుభవాలు.

కింద చెబుతున్న పాయింట్లు అందరికీ వర్తించవు. పల్లెల్లో ఈ సమస్య ఉంది. నేను మరికొందరు మిత్రులను అడిగి నిర్ధారించుకుని రాస్తున్నాను.


పూర్తిగా బ్యాలట్ బాక్సులను తొలగించాలి. ఒక ఎలెక్షన్‌కు బ్యాలట్ బాక్స్ మరోసారి మిషన్లతో పెట్టడం వల్ల వృద్దులు తికమకపడుతున్నారు. 
బూత్‌లోకి వెళ్ళబోయే ముందు పోలింగ్ అధికారి ఇస్తున్న ఓటర్ స్లిప్ వారిని గందరగోళపరుస్తోంది. దానితో మిషన్‌ను ఏదో చేయాలి, లేదా ఆ పేపర్ ఓటు వేయడంలో సహాయపడుతుంది అని అనుకుంటున్నారు. కొంతమంది దాన్ని మిషన్ కింద పెడుతున్నారు.
 
ఎక్కడ నొక్కాలో తెలియడం లేదు. చాలా మంది గుర్తు మీద నొక్కుతున్నారు. అప్పుడు పక్కన నొక్కాలి అని మేము చెబితే దాని పక్కన ఉన్న రెడ్ ఇండికేటర్ మీద నొక్కుతున్నారు. ( ఈ నొక్కడం ఎంత దారుణంగా ఉంది అంటే, మిషన్ పెట్టిన బల్ల భూకంపం వచ్చినట్లు ఊగిపోతోంది )

కాబట్టి గుర్తుల మీదే నొక్కేలా ఏర్పాటు చేస్తే బావుంటుంది. గుర్తులను ఫ్లోరసెంట్ రంగుల్లో ముద్రిస్తే బాగా కనబడుతుంది.

గుర్తులు సరిగా కనిపించడం లేదు. కిటికీలు మూసేస్తారు కాబట్టి వెలుగు ఉండటం లేదు.

ఓటర్లు బూతులోకి ప్రవేశించేసరికి విపరీతమైన టెన్షన్ పడుతున్నారు.
ఎలా వేయాలో తెలియక, తప్పు చేస్తే పోలింగ్ అధికారులు అరుస్తారేమో అక్కడ ఉన్న తమ వాళ్ళు నవ్వుకుంటారేమో అన్న భయం ఓటర్లలో కనిపిస్తోంది.

పైన చెప్పిన సమస్యల వల్ల తాము అనుకున్న గుర్తుకు కాకుండా వేరే గుర్తుకు వేస్తున్న ఓట్లు గణనీయంగా ఉన్నాయి.



ఓటర్లను పోలింగ్ బూత్ వరకు రావడానికి బాగా కృషి చేసిన ఎన్నికల కమీషన్ వీటి మీద కూడా దృష్టి పెట్టాలి. ఒక డమ్మీ మిషన్‌ను ఎన్నికలకు ఆర్నెళ్ళు ముందుగా పంచాయితీ ఆఫీసుల్లో, పట్టణాల్లో జనసమ్మర్దం ఉన్న చోట ఉంచాలి.

సంతకాలు పెట్టలేక బొటనవేలి ముద్రలు వేసినవారు అదే చేత్తో ఓటు నొక్కుతున్నారు. దానివల్ల మిషన్ పాడవుతుంది. బొటనవేలితో ఎక్కువ ఒత్తిడి పడుతుంది కూడా. ఓటును చూపుడు వేలితో వేయాలి అని ప్రచారం చేయాలి. ఎడమ చేతి చూపుడు వేలికి సిరా పెట్టాలి.

రాజకీయ పార్టీలు డబ్బును పంచడం, మందు తాపడంలో ఉన్న శ్రద్ధను కాస్త వీటిపైన పెడితే ఓటర్లకు న్యాయం జరుగుతుంది. ప్రతి అభ్యర్థి డమ్మీ మిషన్లను విధిగా కొనుగోలు చేసేలా కమిషన్ చర్య తీసుకోవాలి.

పోలింగ్ అధికారులే వారిని ఎడుకేట్ చేయాలి అని కమీషన్ చెప్పవచ్చు. కానీ ప్రాక్టికల్గా అది సాధ్యపడదు. క్యూలో ఉన్నవారు గోల చేస్తారు. పోలింగ్ నెమ్మదిగా సాగుతుంది. 1000కి పైన ఓట్లు ఉన్న బూతుల్లో చాలా కష్టం.

ఇక చివరగా పోలింగ్ డ్యూటీలకు వెళ్ళిన వారి తిప్పలు. డిస్ట్రిబ్యూషన్ మరియు రిసీవింగ్ సెంటర్లలో భోజన సదుపాయాలు సక్రమంగా చేయాలి. ఊరికి దూరంగా ఈ సెంటర్లు ఉంటాయి. కొనుక్కుందామన్నా ఏమీ దొరకవు. రిసీవింగ్ సమయం ఏ అర్ధరాత్రో అపరాత్రో ఉంటుంది అప్పుడు ఇంకా దారుణం.
వీటిని నిర్వహించే పై అధికారులు తిండి పెట్టమని చెబ్తారు. వారి కింది స్థాయిలో కక్కుర్తి మనుషులవల్ల నానా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
ఈ డబ్బులను అడ్డదిడ్డంగా వారు తినేయడం కంటే ఎలెక్షన్ కమీషన్ ఇస్కాన్ లాంటి ధార్మిక సంస్థలకు అప్పచెబితే బావుంటుంది. కనీసం కాస్త తిండైనా దొరుకుతుంది.
వీటిమీద అప్పుడే స్పందించి ఫిర్యాదు చేయవచ్చు కదా అంటారా?
ఆ రోజంతా పనిచేసి అలసిపోయి రాత్రి 11 గంటల సమయంలో రిసీవింగ్ పాయింట్ చేరుకున్నాక అప్పుడు విప్లవం అనేది అసాధ్యం. ఓపిక చచ్చిపోయి ఇంటికి చేరుకుందాం అన్న తొందర వుంటుంది.

ఈ సారాంశాన్ని ఆసక్తి ఉన్నవారు ఇంగ్లీష్‌లోకి అనువాదం చేసి ఎలెక్షన్ కమీషన్‌కు పంపితే బావుంటుంది.


ధన్యవాదాలు.

on
categories: | edit post

1 Responses to మోసపోయిన ఓటర్లు ఎందరో....

  1. Anonymous Says:
  2. good info.villages lo emi jaruguthundo chala chakkaga chepparu.

     

Blog Archive

Followers

మాలిక: Telugu Blogs
haaram logo