మా బడికి దగ్గర్లోనే రాజేంద్ర నగరపాలక ఉన్నత పాఠశాల ఉంది. మొన్న వక్తృత్వ పోటీలు నిర్వహించారు. అంశం బాలికల విద్య పేదరికం. దీన్ని వైద్య ఆరోగ్య శాఖవారు నిర్వహించారు. బాలికలు పూర్తిగా అక్షరాస్యులైతే భవిష్యత్తులో జనాభా నియంత్రణ జరుగుతుందని వాళ్ళ ఉద్దేశ్యం. ఈ ప్రచారంలో భాగంగా రకరకాల పోటీలు నిర్వహిస్తున్నారు.



సరే పొటీ మొదలైంది. పిల్లలు వివిధ కోణాల్లో తాము సేకరించిన సమాచారాన్ని ప్రెజెంట్ చేస్తున్నారు. ముత్యాలమ్మ అనే అమ్మాయి వంతు వచ్చింది. అమ్మాయిలు చదువుకోవడం వల్ల వచ్చే లాభం ఏమీ లేదు అంటూ ఇళ్ళల్లో తల్లిదండ్రులు రకరకాల పనుల్లో మమ్మల్ని వాడుకుంటున్నారు. ఇంటిపని, వంటపని, కట్టెలు కొట్టుకురావడం, అప్పుడప్పుడు కూలి పని, పొద్దున సాయంత్రం బయటి ఇళ్ళల్లో పాచిపని ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇంతా చేస్తే నోటు పుస్తకాలు మొదలుకుని ఒక పెన్సిల్ కొనాలన్న ఇంట్లో పెద్ద యుద్ధమే చేయాలి. కానీ మాకు చదవాలని ఉంది అంటూ ఆ అమ్మాయి వల వలా ఏడ్చేసింది. జడ్జీలు మిగతా టేచర్లలో కూడా కన్నీటి పొర.

ఆ అమ్మాయి ఇప్పుడు 10వ తరగతి. సులభంగా 500 మార్కులుపైన తెచ్చుకుంటుందని అందరూ ఊహిస్తున్నారు. ఒక్కసారిగా అందరూ తేరుకుని ఆ అమ్మాయిని ట్యూషన్ పంపడానికి, నోటు పుస్తకాలు , ఇతర సామాగ్రి అన్నీ తీసివ్వడానికి టీచర్లు సంసిద్ధత తెలిపారు. మరి తెలియకుండా మిగిలిపోయిన పిల్లలు ఎంతమంది ఉంటారు? 500 మార్కులు ప్రస్తుత కాలంలో పెద్దమార్కులు కానే కాదు. ఎవరికి? తల్లిదండ్రుల మార్కుల దాహంలో పొద్దుటే లేచి ఇష్టం ఉన్నా లేకపోయినా బూస్టో హార్లిక్సో తాగేసి రోజును మొదలుపెట్టి మళ్ళీ ఏ అర్ధరాత్రో పడుకునే వరకూ చదివి చదివి చదువే ఒక హింసగా తయారైన వారికి. కానీ ఈ పేద పిల్లలకు మరో రకమైన హింస. వీళ్ళు దొంగచాటుగా తల్లిదండ్రులను తప్పించుకుంటూ చదవాలి. మరి వీళ్ళకు 500 మార్కులు దాటడం గొప్పే కదా? వీళ్ళందరి తెలివితేటలు ఏ ఇంటర్మీడియెట్ లోనో భూస్థాపితం అయిపోతాయి. మొండిఘటాలైతే మరో మూడేళ్ళు లాక్కుపోతారు. కానీ చివరాఖరుకు ఎంతమంది ఇలాంటి పిల్లలు పూర్తి స్థాయిలో చదివి ఉద్యోగాల్లో స్థిరపడుతున్నారు?????????????


ఇలాంటివి ఎన్ని ఉన్నా కార్పొరేట్ భారత్ వెలిగిపోతూనే ఉంటుంది. ప్రతి సంవత్సరం ఫోర్బ్స్ జాబితాలో మన దేశం ప్రాతినిధ్యం హనుమంతుడి తోకలా పెరిగిపోతూనే ఉంటుంది. మరి ఈ అసమానతలు ఈ సమస్యలు ఈ కన్నీళ్ళు మన నాయకులకుగానీ వారికి సలహాలు అందించే అత్యున్నత తెలివితేటల అయ్యేయస్సుల వారికి తెలీదా? మన అందరికంటే క్షుణ్ణంగా పూర్తి స్థాయి కాకి లెక్కలతో బాగా తెలుసు. అయినా ఎక్కడి వారు అక్కడే గప్ చుప్. ఎవరి "పని" వారిదే!!



Join hands with...

JEEVANI

......FOR UNCARED

contact : jeevani.sv@gmail.com
9440547123

on
categories: | edit post

0 వ్యాఖ్యలు


Blog Archive

Followers

మాలిక: Telugu Blogs
haaram logo